KCR Movie Review : రాకింగ్ రాకేష్ అందరి హృదయాలను టచ్ చేసాడు

-

టెలివిజన్ లో బాగా పాపులర్ అయిన కామెడీ షో జబర్దస్త్ లో నటించిన కమెడియన్ రాకింగ్ రాకేష్ నిర్మించిన కేశవ చంద్ర రమావత్(కేసీఆర్) సినిమా.. ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతో ఈ సినిమా తీసానని ఇంటర్వూల్లో చెప్పుకున్న రాకింగ్ రాకేష్.. ఈ సినిమాలో హీరోగా కనిపించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం.

కథ:

వరంగల్ జిల్లాలోని మారుమూల తండాలో నివసించే కేశవ చంద్ర రమావత్ కు చిన్నప్పటి కేసీఆర్ అంటే బాగా అభిమానం. ఆ అభిమానం ఊరి జనాలందరికీ తెలుసు కాబట్టి.. ఊర్లో అందరూ అతన్ని ఛోటా కేసీఆర్ అని పిలుస్తారు. కేశవ చంద్ర రమావత్ ని చిన్నప్పటి నుండి అతని మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. పెళ్ళీ డుకొచ్చిన తర్వాత పెళ్ళి చేసుకోమని అడుగుతుంది మంజు. కానీ కేశవ చంద్ర రమావత్ చేసుకోలేనని చెబుతాడు. అదే ఊరిలో ఉండే మరో డబ్బున్న అమ్మాయిని చేసుకోవడానికి కేశవ చంద్ర రమావత్ సిద్ధపడతాడు. తన పెళ్ళికి తెలంగాణ ముఖ్యమంత్రి (ఆ సమయంలో) కేసీఆర్ ని తీసుకొస్తానని ఊరి జనాలకు బడాయి మాటలు చెప్పి హైదరాబాద్ చేరుకుంటాడు. అన్న మాట ప్రకారం కేసీఆర్ ని తీసుకొచ్చాడా లేదా అన్నదే కథ.

విశ్లేషణ:

కేశవ చంద్ర రమావత్ గా రాకింగ్ రాకేష్ మెప్పించాడు. పల్లెటూరి యువకుడిగా చక్కగా ఒదిగిపోయాడు. అమాయకత్వాన్ని తెరమీద చక్కగా పండించాడు రాకేష్. పల్లెటూరు నుండి సిటీకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు పడతారో అలాంటి ఇబ్బందులను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా ద్వారా రాకింగ్ రాకేష్ కి కేసీఆర్ గారంటే ఎంత అభిమానమో తెలిసిపోతోంది.

రాకేష్ పాత్ర తర్వాత మరదలు మంజుగా..అనన్య కృష్ణన్ సరిగ్గా సరిపోయింది. మంజు తండ్రిగా చేసిన మైమ్ మధు పర్ఫార్మెన్స్ ఇరగదీసాడని చెప్పవచ్చు. నటీనటులు అందరూ తమ పాత్రకి తగినట్లుగా న్యాయం చేసారు. కొన్ని డైలాగ్స్ అదిరిపోయాయి. ఊరిని వదిలి పెట్టే మనుషులు ఉంటారు కానీ..మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు అనే డైలాగ్ కి థియేటర్ లో ఈలలు పడతాయి. చరణ్ అర్జున్ మ్యూజిక్ సీన్లను మరింత ఎలివేట్ చేసింది. సినిమాల్లో చాలా సీన్లు తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు చేస్తాయి. జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్ పాత్రల నిడివి తక్కువే అయినా.. వాళ్ళు తెరమీద కనబడినంత సేపు పెదాల నవ్వులు పూస్తూనే ఉంటాయి. సుజాత తనదైన యాసతో అదరగొట్టేసింది.

ఒక్కమాటలో చెప్పాలంటే:

రాకింగ్ రాకేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. హీరోగా బాగా కనిపించాడు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఆశించవచ్చు. మొత్తానికి కేశవ చంద్ర రమావత్ సినిమాతో (కేసీఆర్) రాకింగ్ రాకేష్ అందరి హృదయాలను టచ్ చేసాడు.

నటీనటులు: రాకింగ్‌ రాకేష్‌, అనన్య కృష్ణన్‌, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, మైమ్ మధు, జోర్దార్‌ సుజాత తదితరులు.
మ్యూజిక్: చరణ్ అర్జున్
నిర్మాత: రాకింగ్ రాకేష్
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి

Read more RELATED
Recommended to you

Latest news