సోమవారం విజయవాడ సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందన్నారు. జైలులో మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందన్నారు.
జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని.. రెండు రోజులలో నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు హోంమంత్రి. ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలన్నారు. తమ తప్పులు బయటపడుతున్నాయన్న భయంతోనే విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత.
విజయసాయిరెడ్డి తన స్థాయి, వయసును మరిచిపోయి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. “నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు” అని విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి. విజయసాయి రెడ్డి పై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని అన్నారు.