సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. దీంతో రాత్రి 9.30 గంటలకు ప్రదర్శించిన ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్ సుఖ్ నగర్ చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో ఇవాళ అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించిన అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు పోలీసులు.
ఈ ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. “బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు..? తొక్కిసలాటలో రేవతి అనే మహిళా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవాల్సి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంపైనే” అంటూ ట్వీట్ చేశారు హరీశ్ రావు.