కాంగ్రెస్ ప్రభుత్వం నైజం మరోసారి బయటపడిందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. లగచర్ల ఘటనలో జైలులో ఉన్న ఖైదీకి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించే సమయంలో సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈటల.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై రైతుకు వేసిన బేడీలు.. మీ సర్కార్ కు ఉరితాళ్ళు అవుతాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం.. ఏనాడూ బాగుపడలేదనేది చరిత్ర రుజువు చేసిందని అన్నారు. అంతేగాక లగిచర్ల రైతు ఈర్య నాయక్ గుండె నొప్పితో ఉంటే కనికరం చూపాచాల్సింది పోయి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుందని, ఈ ఘటనతో రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని రుజువైందని ఈటల ఆరోపించారు.