తెలంగాణ శాసనసభల్లో గురుకులాలపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. 10 ఏండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని అంటున్నారు. మరి మీరు ఈ రాష్ట్రాన్ని 56 సంవత్సరాలు పరిపాలించారు. మీరు ఏమైనా అద్దం లాగా ఉద్ధరించి ఇస్తే.. మా 10 ఎండ్లలో ఏమైనా ఖరాబ్ అయిందా? అని హరీశ్ రావు పేర్కొన్నారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
“నేను విద్యార్థి నాయకుడిని.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం కోసం పని చేస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక సదుపాయలు కల్పించాం. మేము, మా ముఖ్యమంత్రి గురుకులాలకు వెళ్లాం. మీరు పదేళ్లలో గురుకులాలకు ఒక్క సొంత భవనం ఎందుకు కట్టలేదు. రాబోయే రోజుల్లో మెస్ చార్జీలు, అద్దె భవనాలకు బకాయిలు లేకుండా చూస్తామని సీఎం చెప్పారు. పదేళ్లలో ఒక్క వైస్ ఛాన్స్ లర్ పోస్టు అయినా భర్తీ చేశారా..? టీచర్ల నియామకాలు లేవు. ప్రమోషన్లు లేవు. ఏం చేశారు. పదేళ్లలో మీరు పెట్టిన బుదర కడగడానికే సమయం సరిపోతుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.