నీటి పారుదల శాఖ సమీక్షలో.. తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌనిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిందని సీఎం తెలిపారు. కేడబ్ల్యూడీటీ-II తదుపరి విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వని విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేప్టటడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు.