ఆంధ్రప్రదేశ్ శాసన మండలికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు అన్ని సాధ్యా సాద్యాలను ఆయన పరిశీలిస్తున్నారు. సీనియర్ మంత్రులతో ఉదయం నుంచి మంతనాలు జరుపుతున్న జగన్ అసెంబ్లీలో మండలి రద్దుపై తీర్మానం ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఉదయం నుంచే జగన్ సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణులు, సీనియర్ లాయర్ ముఖుల్ రోహాత్గీతో చర్చలు జరుపుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కన్నబాబు, బొత్సా, వెల్లంపల్లి సహా కీలక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లంతో కూడా ఆయన చర్చలు జరిపారు. తాను పేదవాడికి మంచి చెయ్యాలి అంటే మండలిలో అడ్డుకున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక ఇదిలా ఉంటే మండలిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ అడ్డుకుని సెలెక్ట్ కమిటికి పంపింది. దీనితో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే మండలి రద్దు విషయంలో అనేక ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన ఉదయం నుంచి కూడా సీనియర్ నేతలతో సమావేశమై సాధ్యాసాధ్యాలను,
అందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక మండలి రద్దు జరగాలి అంటే దాదాపు ఏడాది పాటు ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. నేడో రేపో కేబినేట్ సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన బిల్లుని ఆమోదించి, ఆ తర్వాత దాన్ని శాసన సభలో ఆమోదించి, కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అక్కడ ఉభయ సభల్లో ఆమోదం పొందితేనే మండలి రద్దు అవుతుంది.