ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలనే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే ఉద్దేశ పూర్వకంగా గులాబీ పార్టీ గొడవలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మంత్రి చిట్ చాట్ నిర్వహిచారు. కేసీఆర్,కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్ధిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉంది. ఏ ఒక్కరూ నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని గ్రామ సభల్లో కూడా మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
గత బీఆర్ఎస్ చేత కాని పాలన వల్లే సమస్యలు వస్తున్నాయని పది సంవత్సరాల్లో అన్ని సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. మంచినీ తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం బీఆర్ఎస్ కు అలవాటే అని విమర్శించారు. రాష్ట్రం మొత్తం 3,410 గ్రామాల్లో గ్రామసభలు జరిగితే కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ అనుకూల పత్రికలోనే రాశారని అది కూడా బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆందోళనలేనన్నారు.