రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతుభరోసా రాలేదని కొందరు, అప్పుల బాధలు భరించలేక మరికొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా పంట దిగుబడి రాలేదని మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బొందగూడకు చెందిన రైతు కుమురం పోషయ్య (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోషయ్య తనకున్న 10 ఎకరాల్లో పత్తి పంట వేసాడు. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోషయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.