చలికాలంలో చర్మం పొడిబారటం కామన్..అందుకోసం మనం బాడీలోషన్స్, మూయిశ్చరైజర్స్ వాడటం కూడా కామనే. అయితే వీటిని ఇష్టం వచ్చినట్లు, మనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు రాయకూడదు. వీటిని రాయడానికి కూడా సమయం సందర్భం ఉంటాయండోయ్. క్రమ పద్ధతిలో రాసుకుంటే..మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మనం బాడీలోషన్ ఎప్పుడు రాసుకోవాలి..వీటివల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
కాస్త తడిగా ఉన్నప్పుడే..
ముఖానికి లేదా చర్మానికి క్రీమ్‌లు, లోషన్లు.. మొదలైనవి రాసుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీరు రాసిన క్రీమ్స్ చర్మ గ్రంథులకు చేరే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం ఎంతో కొంత తడిగా ఉన్నప్పుడే వాటిని రాసుకోవాలి. అలా చేయడం వల్ల క్రీమ్ లేదా లోషన్ ఆ తడి ద్వారా చర్మగ్రంథులకు అందుతుంది. ఫలితం లభిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు క్రీమ్ లేదా లోషన్స్ రాయడం వల్ల అవి చర్మంలోకి సరిగా ఇంకవు. క్రీమ్ వేస్ట్..డబ్బులు వేస్ట్.
స్నానం చేసిన వెంటనే..
బాడీలోషన్స్ రాసుకోవడానికి సరైన సమయం స్నానం చేసిన వెంటనే. ఎందుకంటే అప్పుడే చర్మం ఫ్రష్ గా, శుభ్రంగా ఉంటుంది. చర్మకణాలన్నీ తెరుచుకుని ఉంటాయి కాబట్టి ఆ సమయంలో క్రీమ్ లేదా లోషన్స్ రాయడం వల్ల అవి చర్మ గ్రంథుల్లోకి సులభంగా ఇంకిపోతాయి. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత కూడా తప్పకుండా క్రీమ్ లేదా బాడీలోషన్ రాసుకోవాలి. లేదంటే నీటిలో ఉండే క్లోరిన్ వల్ల చర్మం మరింత పొడిగా మారిపోతుంది.
మృదువుగా రాసుకోవాలి..
ముందుగా కొద్దిగా క్రీమ్‌ని చేతిలోకి తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే రాసుకోవాలనుకుంటున్నామో అక్కడ చిన్న చిన్న డాట్స్లా పెట్టి.. సర్క్యులర్గా రుద్దుతూ డాట్స్‌ని కలుపుకుంటూ మొత్తం ఆ ప్రాంతమంతా మృదువుగా రాసుకోవాలి. అప్పుడే చర్మం మరింత నిగారింపుని సొంతం చేసుకుంటుంది. గట్టిగా అదుముతూ, చర్మం మీద ఒత్తిడి కలిగించి రాసే క్రీమ్స్ లేదా లోషన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని గుర్తుపెట్టుకోండి.. పైగా చర్మం కమిలిపోవడం, వదులుగా అయిపోవడానికి అవకాశాలెక్కువగా ఉంటాయి.
కాబట్టి బాడీలోషన్ ఈ పద్ధతిలో అప్లై చేస్తే..మంచి ప్రయోజనం ఉంటుంది.