తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో 3 కోట్ల 4 లక్షల మందికి పైగా వివరాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కులగణన పూర్తి స్థాయిలో చేయలేదనే విమర్శలు రావడంతో మరో 12 రోజులపాటు కులగణన రీసర్వే చేయాలని నిర్ణయించింది సర్కార్. ఈ నెల 16వ తేదీ నుంచి నేటి వరకు 12 రోజుల పాటు రీ సర్వే కొనసాగింది. రెండో దఫా మొత్తం మూడు పద్ధతుల్లో వివరాలను ప్రభుత్వం సేకరించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ వివరాలు పొందుపర్చుచుకోవడం, ప్రజాపాలనా సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు ఇవ్వడం, ఆన్ లైన్
లో ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని కుటుంబ వివరాలు నమోదు చేసి ఆ వివరాలు ప్రజాపాలనా సేవా
కేంద్రంలో సమర్పించడం ఈ మూడు పద్ధతుల్లో ఈసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
2024 నవంబర్ 6న ప్రారంభించి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు సాగిన తొలి దఫా సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కటుంబాల (96.9 శాతం)ను సర్వే చేశామని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ఇంకా 3.1 శాతం (3,56,323) కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు. మిగిలిపోయిన వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.