దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉత్తర భారతంతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీలు దీనిపై రోడ్ల మీదకు వస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణా దీనికి వ్యతిరేకంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇచ్చింది.
వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు. ఈ నేపధ్యంలో ఆ పార్టీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలోని ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన స్పష్టం చేసారు. బుధవారం కర్నూలు జిల్లా ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వైసీపీ ఎంపీలు మద్దతివ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నా అని, చట్టం అమల్లో భాగంగా ముస్లింలకు ఇబ్బందులు తలపెడితే సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన, అవసరమైతే రాజీనామా చేసేందుకూ వెనుకాడనని హెచ్చరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పిన ఆయన, ఆ చట్టాలతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన చెప్పారన్నారు.