ముంబయి పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు ఎట్టకేలకు భారత్ కు చిక్కాడు. భారత్‌కు అప్పగించొద్దంటూ అతడు వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్‌కు అప్పగించేందుకు అమెరికాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో తహవూర్ రాణాను భారత్‌కు తరలించనున్నారు. బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున తహవూర్ రాణా భారత్‌కు చేరుకోన్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలు, ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ సెల్స్‌ను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమయంలో తహవూర్ రాణాను అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరారు. అందుకు ట్రంప్ అంగీకరించారు. ఈ క్రమంలోనే తాజాగా రాణాను భారత్ కు అప్పగించేందుకు వేగంగా ఏర్పాట్లు చేశారు. 2008, నవంబర్‌లో జరిగిన ముంబయి దాడుల్లో తహవూర్ రాణా పాత్ర కీలకమైంది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. పదేళ్ల నుంచి అమెరికా జైల్లో మగ్గుతున్న రాణాను ఎట్టకేలకు భారత్ కు అప్పగించనుంది అగ్రరాజ్యం.