ముంబైలోని గ్లోబల్ ఆస్పత్రికి చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. గత పందేండ్లుగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న రోమన్ పెరీరా అనే వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేశారు. ఈ రోజుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు సాధారణమేగా అందులో వింతేముంది అనుకుంటున్నారా? కచ్చితంగా వింతే ఉందండీ.. ఎందుకంటే ఆ రోగి నుంచి తొలగించిన కిడ్నీలు సాధారణంగా లేవు. దాదాపు 13 కిలోల బరువు తూగాయి. ‘ఆస్టోసోమల్ డామినెంట్ పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ఏడీపీకేడీ)’ అనే అరుదైన వ్యాధి కారణంగా కిడ్నీలు ఇలా అసాధారణ బరువు పెరుగుతాయని వైద్యులు తెలిపారు.
ముంబై నివాసి అయిన రోమన్ పెరీరా గత పదేండ్లుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడ్డాడు. తన శరీరానికి సరిపడే కిడ్నీ దాత దొరకకపోడంతో.. నిత్యం డయాలసిస్ చేయించుకుంటూ నరకయాతన అనుభవించాడు. ఆయన భార్య కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడ్డా.. ఆమె కిడ్నీ అతనికి సూట్ కాలేదు. దీంతో క్రమంగా వ్యాధి ముదిరిపోయింది.
మరోవైపు అమరావతికి చెందిన నితిన్ అనే కిడ్నీ పేషెంట్‌కు కూడా కిడ్నీ మార్పిడి అవసరమైంది. దీంతో పెరీరా భార్యలాగే నితిన్ భార్య కూడా కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. కానీ, ఇక్కడ కూడా భార్య కిడ్నీ భర్తకు సూట్ కాలేదు. ఈ నేపథ్యంలో వైద్యులు పెరీరా భార్య కిడ్నీ నితిన్‌కు, నితిన్ భార్య కిడ్నీ పెరీరాకు సూటవుతుందని గుర్తించారు. వెంటనే ఇద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.
అయితే, పెరీరా నుంచి తొలగించిన కిడ్నీల సైజు చూసి వైద్యులు షాకయ్యారు. ఆ కిడ్నీలను తూకం వేస్తే.. ఒకటి 7 కిలోలు, మరొకటి 5.8 కిలోల బరువు తూగాయి. అంటే రెండు కిడ్నీలు కలిపి 12.8 కిలోలు ఉన్నాయి. కాగా, ‘ఆస్టోసోమల్ డామినెంట్ పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ఏడీపీకేడీ)’ అనే అరుదైన వ్యాధి కారణంగా పెరీరా కిడ్నీలు అసాధారణ బరువు పెరిగాయని వైద్యులు తెలిపారు. ఏదేమైనా ముంబై గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు కిడ్నీ రోగులను ప్రాణాపాయం నుంచి తప్పించడం సంతోషించదగ్గ పరిణామమే కదా!