కేంద్ర కులగణన నిర్ణయం… సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనపై కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న డిమాండ్‌ను రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర”లోనే స్పష్టంగా వెల్లడించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అడిగిన దారిలో ముందడుగు వేసిన మొదటి రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి గుర్తుచేశారు. రాహుల్ సూచనలతో రాష్ట్రంలో మొదలైన మార్పు దేశవ్యాప్తంగా అమలవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇక, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దేశ జనగణనలో కుల గణన చేర్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ విజయాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశానికి మార్గదర్శిగా నిలిచిందని వివరించారు. 1931లో బ్రిటిష్ కాలం తరువాత ఇది మొదటిసారి దేశస్థాయిలో కులగణన చేపట్టబోతున్న కేంద్రం నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల మంత్రిగా కేంద్రంలో ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన వారిని అభినందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news