మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో, డిగ్రీ విద్యార్థులకు ఇప్పటివరకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఇవ్వగలిగిన ప్రభుత్వం, విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతుంది?” అని హరీష్ రావు ప్రశ్నించారు. డిగ్రీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.800 కోట్ల రీయంబర్స్ మెంట్ ఆలస్యమవడంతో దాదాపు 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని అన్నారు.
అలాగే, ఎగ్జామ్స్ ఆలస్యం కావడం వల్ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు లాసెట్, పీజీసెట్, ఇతర పరీక్షలు రాయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్‌లోనే జరగాల్సిన పరీక్షలు ఇంకా జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఇబ్బందులు ఉన్నా ఫీజు రీయంబర్స్ మెంట్ ఆపలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే విద్యార్థులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. డిగ్రీ అడ్మిషన్లు నిలిపివేసి, కాలేజీలు మూసే పరిస్థితిని తీసుకువచ్చిందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా అలసత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో త్వరలో రీయంబర్స్ మెంట్ ఇస్తామని ప్రకటించినా ఇప్పటికీ అమలు జరగలేదని అన్నారు. “పాలన చేయలేకపోతే విద్యార్థులపై ఆటలు ఆడటం సహించబోదు,” అని హెచ్చరించారు.