రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు సహజమని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతరం మాట్లాడిన కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన ధన్యవాద తీర్మానం పై మాట్లాడారు. ఎవరూ ఈ సభలో శాస్వతంగా ఉండరన్న ఆయన, ఇందిరా గాంధి లాంటి వాళ్ళు కూడా సామాన్యుల చేతిలో ఓడిపోయారని అన్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణమని, దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు దశాబ్దాలు పాలించిన పార్టీకి నాలుగు ఓట్లు రాలేదని ఎద్దేవా చేసారు. ఎన్ని జరిగినా దేశ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావడం లేదని అన్నారు. తన ప్రసంగం వినలేని వాళ్ళు బయటకు వెళ్లిపోవచ్చు అని అన్నారు. కాంగ్రెస్ గొంతు చించుకోవద్దని, తాము వందమందిమి ఉన్నాం అన్నారు. రాజకీయాల్లో సహనం అవసరమని అన్నారు.
ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు పాలిస్తారని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కి అలవాటే అన్నారు. సభలో ఇస్తాను సారం వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేసారు. అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణా సాధించామని కెసిఆర్ అన్నారు. ఏ మాత్రం మేము వెనకడుగు వేసినా తెలంగాణా రాదని అన్నారు. తప్పుడు ప్రచారం చేసారు కాబట్టే వాళ్ళను సస్పెండ్ చేసామని అన్నారు.
తెలంగాణా ఉద్యమాన్ని నీరు గార్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందని కెసిఆర్ ఆరోపించారు. సభలో కాంగ్రెస్ సభ్యుల వైఖరి అందరూ చూసారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్ధం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేసారు. ఏది ఏమైనా అధికారం కావాలని కాంగ్రెస్ కక్కుర్తి పడుతుంది అన్నారు. తమపై కేసులు పెట్టి తెలంగాణా ఉద్యమాన్ని ఆపాలని చూసారు అంటూ కెసిఆర్ మండిపడ్డారు.