భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. ఇప్పుడు మరో యువ జవాన్ కూడా వీరమరణం పొందారు. జమ్మూలో పాక్ కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు.
సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర-తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయినట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్ భారత్ పై కాల్పులు జరిపి.. ప్రస్తుతం కాళ్ల బేరానికి వచ్చినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు. పాకిస్తాన్ పై భారత్ దాడులు ఆపితే.. తాము కూడా ఆపుతాం అని వెల్లడించారు.