2,00,000 దాటిన కరోనా కేసులు!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతున్నది. మార్చి 18 నాటికి మొత్తం కేసుల సంఖ్య 2,03,530కి చేరింది. పాజిటివ్‌ కేసులతోపాటు కరోనా మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 18 నాటికి మొత్తం 8,205 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆసియా దేశాలకు చెందినవారు 3,384 మంది, యూరప్‌లో దేశాల ప్రజలు 3,422 మంది ఉన్నారు. మనదేశంలోనూ మొత్తం 151 కరోనా కేసులు నమోదవడంతోపాటు మూడు మరణాలు సంభవించాయి.

ఇక అమెరికా, ఇటలీ, ఇరాన్‌, స్కాట్లాండ్‌ తదితర దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుంటే.. ఈ వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనాలో మాత్రం ఈ మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చింది. చైనాలో బుధవారం కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. అటు దక్షిణ కొరియాలో సైతం కరోనా కట్టడిలోకి వచ్చింది. ఈ రెండు దేశాల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన చాలామంది వేగంగా వైరస్‌ నుంచి విముక్తి పొందుతున్నారు.

అమెరికాలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య బుధవారానికి 105కి చేరింది. మొత్తం 50 రాష్ట్రాలు ఈ వైరస్‌ బారిన పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6500కి పెరిగింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ మెడికేర్‌, టెలీహెల్త్‌ సేవలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ఫోన్‌ లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య సేవలు పొందాలన్నారు. కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో యూరోపియన్‌ యూనియన్‌ సరిహద్దులను మూసేసింది. ఇతర దేశాల ప్రజలు 30 రోజులపాటు యూరోపియన్‌ దేశాల్లోకి రాకూడదని నిషేధం విధించింది. యూరోపియన్‌ దేశాల్లో ఇటలీని కరోనా బాగా దెబ్బతీసింది. ఇటలీ మినహా మొత్తం యూరప్‌ దేశాల్లో 3,422 కరోనా మరణాలు సంభవించగా.. ఒక్క ఇటలీలోనే 2,978 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, ఇరాన్‌లో కూడా కరోనా విజృంభన కొనసాగుతున్నది. అక్కడ మంగళవారం ఒక్కరోజే 147 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరాన్‌లో మొత్తం మరణాల సంఖ్య 1135కు చేరింది. అటు ఆఫ్రికాలోనూ ఇప్పటివరకు 500 కరోనా కేసులు నమోదయ్యాయి. బుర్కినాఫాసోలో తొలి మరణం చోటుచేసుకుంది. లాటిన్‌ అమెరికాలో 1100 కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో మంగళవారం తొలి మరణం సంభవించింది. ఇక ఆస్ట్రేలియాలో 454 మంది కరోనా బారినపడగా.. ఐదుగురు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news