కరోనా వైరస్ దెబ్బకి ఏకంగా ప్రపంచమే తలకిందులైనంత పని అవుతోంది. స్టాక్ మార్కెట్ నుండి చిరు వ్యాపారుల దాకా అందరికి ఒకటే భయం… కరోనా. ఇది ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలని తీసింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటికే 160 దేశాలను హడలిస్తోంది. అంతేకాదు ఆర్ధికంగాను అన్ని దేశాలు సంక్షోభంలో పడిపోతున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీస్ అంటే హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా కరోనా దెబ్బకి వందల కోట్ల నష్ఠాలను చూడవలసి వస్తోంది. హాలీవుడ్ తో పాటు సౌత్ అండ్ నార్త్ లలో కూడా కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే చాలా సినిమా షూటింగ్ లు అర్ధతరంగా నిలిచిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా ఎఫెక్ట్ హాలీవుడ్ సక్సస్ ఫుల్ ఫ్రాంఛైజీ అవతార్-2కి పడింది. అవతార్ ఫస్ట్ పార్ట్ అద్భుతమైన సక్సస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అవతార్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఈ సినిమా మేకర్స్ ఈ ఫ్రాంఛైజీ నుంచి మరిన్ని సీక్వెల్స్ రూపొందించడానికి భారీగా బడ్జెట్ ని కేటాయించి ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టారు.
దీనిలో భాగంగా మొత్తం నాలుగు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే అవతార్-2 చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సినిమాకు కీలకమైన విజువల్ గ్రాఫిక్స్ పనులు వివిధ దేశాల్లో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. అయితే షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ని న్యూజిలాండ్ లో చేయాల్సి ఉండగా కరోనా దెబ్బకి మొత్తం ఆగిపోయిందట. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నిటిని నిర్ధాక్షణంగా నిలిపివేశారట.
మేకర్స్ ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం అవతార్2 ని ఈ ఏడాది విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బతో అది సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. అంతేకాదు ఈ ఎఫెక్ట్ మిగతా భాగాలకు పడిందని సమాచారం. అవతార్2 ని మొదలుకొని మిగతా అన్ని భాగాలను వరుసగా 2023, 2025, 2027లోరిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా దెబ్బకి ఈ ఫ్రాంఛైజీ మొత్తం కుదేలయిందని తెలుస్తుంది.