ఏపీలో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితి పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. తాజాగా జగన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని.. వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు అత్యంత మందగమనం చూపించాయని అన్నారు.
జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది ఏపీ పై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని.. ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు తప్పులు లెక్కల ప్రచారం చేశారని పేర్కొన్నారు.