హైదరాబాద్ లోని మల్లాపూర్ లో జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ నేతలతో ఉత్సాహం నింపేలా మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ కనిపిస్తున్నాడని.. ఎప్పుడూ జై మోడీ, జై ఢిల్లీ అంటున్నాడని.. కానీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. ఇది ఆయన చిత్తశుద్దికి నిదర్శనం అంటూ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి నాయకులు ప్రజల బాటలో లేరని.. రాజీనామా చేయకుండా పక్కకి నడిచారని గుర్తు చేశారు. రాజీనామా చేయమంటే జీరాక్స్ పేపర్స్ ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తి చూపే బదులు.. దాన్ని మరుగున పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహుల జాబితాలో మొదటి పేరు చంద్రబాబు.. రెండో పేరు రేవంత్ రెడ్డిదే రాయాలని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ ప్రతీ విషయంలో వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని తెలిపారు.