ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. కంచె గచ్చిబౌళి భూముల తనాఖా వెనుక బీజేపీ ఎంపీ రమేష్ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. భూములు తనఖాకు సహాయం చేసినందుకు సీఎం రమేష్ కి ప్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల రోడ్లు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇది ముమ్మూటికీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధం అన్నారు. కేంద్ర సాధికారిత కమిటీ రిపోర్టు పై ఇప్పటివరకు బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో ఎందుకు మౌనంగా ఉందో తెలపాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కేటీఆర్ ఆరోపణలపై తాజాగా ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. గత పదేళ్లలో కేటీఆర్ చేసినవన్నీ తనకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్. యూఎస్, మాల్దీవులకు ఆయన ఎలా వెళ్లారో.. ఏం చేశారో తనకు బాగా తెలుసు అని.. ఈ వివరాలు ఈడీ, సీబీఐకి ఇస్తానని వ్యాఖ్యానించారు. కేటీఆర్ రాజకీయంగా ఎదిగాక మనుషులను మరిచిపోయారు. ఫ్యూచర్ సిటీలో నాకు ఏ కాంట్రాక్టు లేదని.. నిబంధనల ప్రకారమే రుత్విక్ కంపెనీకి కాంట్రాక్టు వచ్చింది అన్నారు. దీనిపై కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.