జాతీయ సినీ అవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినీ రంగంలో విశేష కృషి చేసిన చిత్రాలకు, కళాకారులకు రాష్ట్రపతి చేతులమీదుగా అందించనున్నారు. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను జ్యూరీ నిన్న ప్రకటించింది. అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేస్తుంది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది.
ఈ క్రమంలో 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉత్తమ చిత్రంగా 12వ ఫెయిల్ కు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరియు తెలుగు టాలెంట్ దర్శకత్వం వహించిన చిత్రాలు 10 కంటే ఎక్కువ అవార్డులు గెలుచుకోవడం చూసి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మరియు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో విజేతలందరికీ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. భారతీయ సినిమాకు ఈ గౌరవాలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.