జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో ఆయన విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కృషి చేశారు. అనంతరం ఆయన మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు 1972లో ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. ఈ పార్టీ జార్ఖండ్ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. శిబు సోరెన్ మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏసారి కూడా పూర్తి కాలం పాలించలేకపోయారు. మొదటిసారి 2005లో కేవలం 10 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. రెండో సారి 2008 నుంచి 2009 వరకు, మూడో సారి 2009 నుంచి 2010 వరకు సీఎంగా పని చేశారు. దుమ్కా లోక్ సభ నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.