బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న 72 గంటల దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద సోమవారం ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంఘీభావంగా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు, ఐఎన్ఎల్ డీ నేత, హర్యానా ఎమ్మెల్యే అర్జున్ సింగ్ చౌతాలా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం అంటూ కొనియాడారు. ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కవిత పోరాటం చేయడం లేదని, ఒక న్యాయమైన డిమాండ్ కోసం ఆమె పోరాడుతున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత పోరాటంలో మేము భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు. కవిత ఢిల్లీలో పోరాడిన, హైదరాబాద్ లో పోరాడిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేశంలో వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక జబ్బు వంటిదని, ఆ జబ్బును నయం చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెగిలించాలని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.