కరోనా ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో మన దేశంలోనూ కరోనా ప్రభావం చాలా రంగాలపై పడింది. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇక త్వరలో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్న వారు వాటిని నెల నెలా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు అనేక కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించే స్థితిలో లేవు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిలో బ్యాంకులు తమ కస్టమర్లకు శుభవార్త చెప్పాయి. కరోనా ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్లు బ్యాంకులు తెలిపాయి.
దేశంలోని ముఖ్యమైన బ్యాంకుల్లో కొన్ని బ్యాంకులైన.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు తమ కస్టమర్లకు కోవిడ్ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ పేరిట ప్రత్యేకంగా లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, అందుకనే తమ కస్టమర్లకు అండగా ఉండాలని నిర్ణయించామని, ఈ క్రమంలోనే వారికి ప్రత్యేక లోన్లు అందించనున్నామని.. ఆయా బ్యాంకులు తెలిపాయి.
తాము ఇచ్చే లోన్ల ద్వారా చిరు వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందని ఆయా బ్యాంకులు తెలిపాయి. అలాగే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కూడా ప్రత్యేక రుణాలు అందిస్తామని బ్యాంకులు వెల్లడించాయి. దీని వల్ల వారికి ఎదురయ్యే ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు ఉపశమనం కలుగుతుందని బ్యాంకులు తెలిపాయి.