కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలకు తీవ్రమైన నష్టం కలుగుతున్న సంగతి తెలిసిందే. ముందు ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా ఉండబోతుంది.. అన్న విషయాన్ని తలుచుకుంటేనే.. ఆందోళనకరంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అనేక కంపెనీలకు ఈ ఏడాది భారీగా నష్టాలు వస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలైన ఫేస్బుక్, గూగుల్‌లకు ఈ ఏడాది భారీ నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు.
గూగుల్ ఈ ఏడాది 127.5 బిలియన్ల ఆదాయం ఆర్జిస్తుందని, ఈ క్రమంలో ఆ కంపెనీకి 28.6 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని.. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కోవెన్ అండ్ కో వెల్లడించింది. ఇక ఫేస్‌బుక్‌కు 67.8 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని, ఈ కంపెనీకి కలిగే నష్టం ఈ ఏడాదికి 15.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని కోవెన్ అండ్ కో తెలిపింది. ఈ క్రమంలో ఈ సంస్థలకు 2020లో 44 బిలియన్ డాలర్ల వరకు నష్టం వస్తుందని కోవెన్ అండ్ కో అంచనా వేసింది.
గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఆదాయం ఎక్కువగా అడ్వర్టయిజ్మెంట్ల నుంచే వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆ ఆదాయానికి భారీగా కోత పడుతుందని కోవెన్ అండ్ కో అంచనా వేస్తోంది. అయితే 2021లో ఫేస్‌బుక్‌కు లాభాలు వచ్చేందుకు అవకాశం ఉందని ఆ కంపెనీ తెలిపింది. ఈ మేరకు కోవెన్ అండ్ కో తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో కేవలం ఈ రెండు కంపెనీలే కాదు.. దాదాపుగా అన్ని కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టం వస్తుందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. మరి ఆ నష్టం ఎంత వరకు ఉంటుందో తెలుసుకోవాలంటే.. కొంత కాలం వరకు వేచి చూడక తప్పదు..!