మీ ఇంటిని ఒక చిన్నపాటి ఔషధశాలగా మార్చుకోవడం ఎలా? దీనికి మీకు పెద్ద స్థలం అవసరం లేదు కేవలం ఒక చిన్న కుండ, కాసింత మట్టి మరియు కొన్ని అద్భుతమైన మొక్కలు ఉంటే చాలు. మన తాతల కాలం నుండి ఇంటి పెరట్లో ఉండే తులసి, చర్మానికి ఉపయోగపడే కలబంద వరకు ఎన్నో అద్భుతమైన ఔషధ మొక్కలు మన ఇంటి ఆరోగ్యానికి రహస్యాలుగా ఉన్నాయి. ఈ మొక్కలు కేవలం అందానికే కాదు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారాన్ని అందిస్తాయి. మరి మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చో తెలుసుకుందామా..
తులసి చెట్టు: తులసిని ప్రతి ఇంట్లో మనం చూస్తాం. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు, ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలకు తులసి ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. తులసి ఆకులను వేడి నీటిలో వేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలోవెరా : అలోవెరా మొక్కకు చాలా తక్కువ నీరు అవసరం. దీని జెల్ చర్మ సంబంధిత సమస్యలకు కాలిన గాయాలకు మంచి పరిష్కారం. సూర్యరశ్మి వల్ల కలిగే ఇబ్బందులకు అద్భుతమైన పరిష్కారంగా అలోవీరా జెల్ ఉపయోగపడుతుంది. ఈ జెల్ ను ముఖానికి రాస్తే చర్మం మృదువు గా కాంతివంతంగా మారుతుంది.

పుదీనా: పుదీనాను చిన్న కుండలో సులభంగా పెంచవచ్చు. ఇది జీర్ణ క్రియ సమస్యలకు, తలనొప్పికి మరియు శ్వాస సంబంధిత సమస్యలకు ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల కడుపుఉబ్బరం తగ్గుతుంది.
వాము ఆకు: వాము ఆకు దీనిని కొంతమంది కర్పూరవల్లి అని కూడా అంటారు. దగ్గు, జలుబు, ఆయాసం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకును వేయించి కషాయంలా తీసుకుంటే శ్వాసనాళాలు శుభ్రపడతాయి. చిన్నపిల్లల జలుబుకు కూడ మంచి ఔషధంగా చెప్పొచ్చు.
కొత్తిమీర: కొత్తిమీర మన వంటింట్లో మాత్రమే కాదు, జీర్ణ క్రియ కు ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకుల ను రసంలో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
తులసి, అలోవెరా, పుదీనా, వాము ఆకు వంటి ఔషధ మొక్కలను ఇంట్లోనే చిన్న కుండలో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్కలు మన రోజువారి ఆరోగ్య సమస్యలకు సహజమైన పరిష్కారాలను అందిస్తాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను గురించి మాత్రమే. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.