మహాభారతంలోని అత్యంత హృదయ విధారకమైన ఘట్టాలలో ద్రౌపదీ వస్త్రాపహరణం ఒకటి. కౌరవుల కపట జూదంలో పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయి, చివరకు తమ సతీమణి ద్రౌపదిని కూడా పనంగా పెట్టి ఓడిపోతారు. దుశ్యాసనుడు, దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు ద్రౌపది నిండు సభలో లాక్కుని వస్తాడు. ఆమెను అవమానించడానికి ఆమె చీరను లాగడం మొదలు పెడతాడు. నిస్సహాయంగా అంధుడైన ధృతరాష్టుడు మిగిలిన పెద్దలంతా మౌనంగా చూస్తుంటారు. ఆ నిస్సహాయత స్థితిలో ద్రౌపది చేసిన భక్తి పూర్వక ప్రార్థన, దానికి శ్రీకృష్ణుడు స్పందించిన తీరు ఈ ఘట్టాన్ని చిరస్మరణీయం చేసింది.
ద్రౌపది మొదట తన భర్తల వైపు ఆ తరువాత సభలోని పెద్దల వైపు సహాయం కోసం చూస్తుంది. కానీ ఎవరు ముందుకు రాలేదు. ఆఖరి ఆశగా ఆమె రెండు చేతులు పైకెత్తి శ్రీకృష్ణుడిని ‘గోవిందా ద్వారాక వాసా గోకులం వదిలి వెళ్ళిన కృష్ణ ఆపదలో ఉన్న వారిని రక్షించే వాడా’ అంటూ మనసులో ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థన కేవలం ఒక పిలుపు కాదు అది పూర్తి నమ్మకంతో కూడిన భక్తురాలి ఆర్తి.

మౌనంగా ద్రౌపది చేసిన పిలుపు శ్రీకృష్ణుడిని కదిలించేసింది. ద్రౌపది శ్రీకృష్ణుడిని మనసారా స్మరించిన క్షణంలో కృష్ణుడు తన దివ్య శక్తితో చీరను నిరంతరంగా పెంచుతూ ఉంటాడు. దుస్యాసనుడు ఎంత లాగినా చీర అంతులేకుండా పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. నిస్సహాయంగా అలసిపోయిన దుశ్యాసనుడు చివరికి ఆ పని మానుకుంటాడు. ఈ అద్భుతం సభలో వారందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఈ సంఘటన కేవలం ద్రౌపదిని రక్షించడం మాత్రమే కాదు, ఇది ధర్మానికి కలిగిన విజయం. ఒక భక్తుడి పవిత్రమైన పిలుపుకు భగవంతుడు ఎలా స్పందిస్తాడో చూపించే గొప్ప ఉదాహరణ. భగవంతుడిపై అచంచలమైన నమ్మకం ఉంటే ఆయన ఏ రూపంలో నైనా వచ్చి రక్షిస్తాడని ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది.
మహాభారతం కథ మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. కష్టాలు ఎదురైనప్పుడు మనకు సహాయపడే మనుషులు లేకపోయినా భగవంతుడిపై నమ్మకం ఉంచాలి. అప్పుడు మనకు తెలియని శక్తి మనల్ని ఆదుకుంటుంది.
ద్రౌపతి వస్త్రాపహరణం ఘట్టం ద్రౌపదికి జరిగిన అవమానం మాత్రమే కాదు, అది ఆమె పవిత్రమైన భక్తికి భగవంతుడి అద్భుతమైన రక్షణకు నిలువెత్తు నిదర్శనం. భక్తి పిలుపుకు భగవంతుడు ఎలా స్పందిస్తాడో ఈ కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.