మన శరీరానికి ఎముకలు ఒక బలమైన పునాది వంటివి. అవి మన శరీరానికి ఆకృతిని ఇవ్వడమే కాకుండా ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి కదలికలకు సహాయపడతాయి. ఎముకలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అవి కేవలం మనల్ని నిలబెట్టడానికి మాత్రమే కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను నిల్వ చేస్తాయి. చిన్ననాటి నుంచే బలమైన ఎముకలను నిర్మించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతుంది. అందుకే, ఆరోగ్యకరమైన ఎముకల కోసం మన రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం చాలా అవసరం మరి వాటిని తెలుసుకుందాం ..
కాల్షియం అధికంగా ఉండే ఆహారం: ఎముకల నిర్మాణానికి కాల్షియం చాలా ముఖ్యం. పాలు పెరుగు, పనీర్, జున్ను వంటి పాల ఉత్పత్తులు, అలాగే ఆకుకూరలు (పాలకూర, బ్రొకోలీ) నువ్వులు, బాదం, రాగులు వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
విటమిన్ D : కాల్షియంను శరీరం గ్రహించడానికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి కోసం రోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలో నిలబడండి. చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్లు, పుట్టగొడుగులలో కూడా విటమిన్ డి ఉంటుంది.
బరువు మోసే వ్యాయామాలు: నడక, పరుగు, డాన్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి. వ్యాయామం చేయడం వల్ల ఎముకలు వాటి సాంద్రతను పెంచుకుని మరింత బలంగా తయారవుతాయి.

ధూమపానం, మద్యం మానుకోండి: ధూమపానం, మద్యం ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి. ఈ అలవాట్లను మానుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రొటీన్: ఎముకలకు ప్రొటీన్ కూడా చాలా అవసరం. మాంసం, చేపలు, పప్పులు, సోయా, పన్నీర్ వంటి ఆహారాలు ప్రొటీన్‌కు మంచి వనరులు.
పొటాషియం-విటమిన్ K : ఈ పోషకాలు కూడా ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. అరటిపండ్లు చిలకడదుంప, టమాటాలు, ఆకుకూరలు, క్యాబేజీ, గుమ్మడికాయ వంటివి మీ ఆహారంలో చేర్చుకోండి.
ఈ చిన్నపాటి చిట్కాలను అనుసరించడం వల్ల మీరు మీ ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు వయసుతో పాటు వచ్చే ఎముకల బలహీనతను నివారించవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఎముకల సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించండి.