మనుషుల జీవితంలో మరణం ఒక విషాద సంఘటన. మరణించిన వారి జ్ఞాపకాలు మన మనసుల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మనల్ని వీడి వెళ్లిన వారి జ్ఞాపకాలను మనం ఎప్పటికీ మర్చిపోలేము. వారి ఆత్మకు శాంతి కలగాలని మనం చేసే కర్మకాండలలో, ఆఖరి రోజున మనం వారికి ప్రియమైన వస్తువులను దానం చేస్తాం. ఈ ప్రక్రియలో అనేక సందేహాలు తలెత్తుతాయి. దానం చేసిన వస్తువులను తిరిగి ఉపయోగించుకోవచ్చా? అలా చేయడం సరైనదేనా? నమ్మకాలు, వాస్తవాల మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
మరణించిన వారి పేరు మీద చేసే దానధర్మాలు, ముఖ్యంగా కర్మ రోజున వస్తువులను దానం చేయటం గొప్ప సంప్రదాయం. ఈ ఆచారం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం ఉంది. మరణించిన వారి ఆత్మకు శాంతి లభించడం, అలాగే వారి జ్ఞాపకాలను మనతో సజీవంగా ఉంచుకోవడం. ఈ క్రమంలో బంధువులు, స్నేహితులకు భోజనం పెట్టి, దుస్తులు, గృహోపకరణాలు, ఇతర వస్తువులను,ఎవరి స్తోమతను బట్టి వారు దానం చేస్తారు.
అయితే, ఈ దానాలు అందుకున్న వ్యక్తులు ఆ వస్తువులను ఉపయోగించుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొన్ని నమ్మకాల ప్రకారం, కర్మ రోజున ఇచ్చిన వస్తువులు మృతుడికి సంబంధించినవి కాబట్టి, వాటిని వాడకూడదని అంటారు. అలా వాడితే వారికి అశాంతి కలుగుతుందని లేదా అశుభం అని భావిస్తారు. ఈ నమ్మకాలు ఎక్కువగా మూఢనమ్మకాల నుంచి పుట్టుకొచ్చాయని కొందరు చెబుతారు. మరికొందరు మాత్రం ఈ దానం మృతుడి స్మృతికి గౌరవంగా భావించి, ఆ వస్తువులను జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటారు.వాటిని వాడుతున్నప్పుడు మరణించిన మనిషి గుర్తు తెచ్చుకోవటంగా భావిస్తారు.

వాస్తవానికి, ఏ మత గ్రంథంలోనూ లేదా శాస్త్రంలోనూ కర్మ రోజున ఇచ్చిన వస్తువులను ఉపయోగించకూడదని స్పష్టంగా లేదు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం దానం చేయడం, మృతుడికి గౌరవం ఇవ్వడం. వస్తువులను తిరిగి ఉపయోగించుకోవడం అనేది దానిని పొందిన వ్యక్తి అవసరాన్ని బట్టి, వారి వ్యక్తిగత నమ్మకాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు, బట్టలు అవసరమైన పేదవారికి దానం చేస్తే, వారు వాటిని ఉపయోగించుకోవడం వల్ల మరణించిన వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అదే విధంగా, స్మృతి చిహ్నంగా ఒక వస్తువును ఉంచుకోవడం కూడా సాధారణమే. కాబట్టి, ఇది వ్యక్తిగత ఉద్దేశ్యం మీద ఆధారపడి ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం వివిధ నమ్మకాల, సంప్రదాయాల ఆధారం గా తెలిపినది మాత్రమే, ఈ విషయాలు పూర్తిగా వ్యక్తిగత నమ్మకాలను, ఆచారాలను బట్టి ఉంటాయి.