బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే ప్రజలు మాత్రం మాట వినే పరిస్థితి కనపడటం లేదు. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు అందరూ కూడా బయటకు వచ్చి తిరుగుతున్నారు. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా సరే ఎవరూ కూడా మాట వినడం లేదు. దీనితో పోలీసులు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే లాఠీలకు పని చెప్పారు.
లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 20 వేల వాహనాలను తెలంగాణా పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 80 వేల కేసులు వాహనదారులపై నమోదు చేసారు అధికారులు. సీజ్ చేసిన వాహనాలపై ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజల జీవితాలకు, ఆరోగ్యానికి, భద్రతకు భంగం కలిగించినప్పడు వాడే సెక్షన్ 188 సెక్షన్ కింద కేసు పెడుతున్నారు.
ఇప్పుడు ఈ కేసులు ఎక్కువగా హైదరాబాద్ లో నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. సైబరాబాద్ కమిషనరేట్‌లోనే రోజూ 15వేల నుంచి 20వేల వెహికల్స్‌పై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నెల 24న ఒక్క సైబరాబాద్ కమిషనరేట్‌లోనే 20 వేలకు పైగా కేసులు నమోదు చేసారు. ఇతర కమిషనరేట్లలో 80 వేల వరకు కేసులు నమోదు చేసారు. ఇప్పుడు ప్రజలను కట్టడి చెయ్యాలి అంటే ఇంతకు మించిన మార్గం లేదని భావిస్తున్నారు.