‘ఆహా’ ఒరిజిన‌ల్స్‌.. ‘సిన్’ సిరీస్‌.. మంచి మెసేజ్ ఇచ్చారు.. మసాలా అవ‌స‌ర‌మా..?

-

గ‌త కొంత కాలం కింద వ‌ర‌కు కేవ‌లం హిందీ సినిమా రంగంలోనే.. అడల్ట్ సినిమాలు తీసేవారు.. ఇక సిరీస్‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాటిల్లో అస‌లు స్టోరీ కంటే.. మ‌సాలా సీన్లే ఎక్కువ‌గా ఉంటాయి. అయితే మేం కూడా ఎందులోనూ త‌క్కువ కాదు.. అని అనుకున్నారేమో.. లేదో.. తెలియ‌దు కానీ.. తెలుగులోనూ అడ‌ల్ట్ సినిమాలు, సిరీస్‌ల జోరు ఎక్కువైంది. ఇక ఈ మ‌ధ్యే ‘ఆహా’ పేరిట ప్ర‌ముఖ సినీ నిర్మాత అల్లు అర‌వింద్ లాంచ్ చేసిన ఓ వీడియో స్ట్రీమింగ్ యాప్‌లోనూ.. ‘ఆహా ఒరిజిన‌ల్స్’ పేరిట ప‌లు సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ‘సిన్’ అనే సిరీస్ కూడా ఒక‌టి.

aha originals sin series given good message

‘సిన్’ సిరీస్‌లో మ‌సాలా సీన్లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని మ‌రీ అంత బోల్డ్‌గా తెర‌కెక్కించ‌లేదు. ఈ సిరీస్ సీజ‌న్ 1లో ఉన్న 7 ఎపిసోడ్ల‌లోనూ అలాంటి మ‌సాలా సీన్లు మూడో, నాలుగో మ‌న‌కు క‌నిపిస్తాయి. కానీ.. ద‌ర్శ‌కుడు ఈ సిరీస్‌లో చెప్ప‌ద‌ల‌చుకున్న స్టోరీకి ఆ మ‌సాలా సీన్లు ఉండాల్సిన అవ‌స‌రం లేదు. క‌థ‌ను చెప్ప‌ద‌లిస్తే.. ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కు ఏ ర‌కంగానైనా చెప్ప‌వ‌చ్చు. అందులో మ‌సాలా సీన్ల‌ను చొప్పించాల్సిన ప‌నిలేదు. స‌మాజానికి మెసేజ్ ఇస్తున్నాం చెప్పి తీసే సినిమా అయినా.. సిరీస్ అయినా.. వాటిల్లో మ‌సాలా సీన్ల అవ‌స‌రం లేదు. జ‌నాలు అవి లేకున్నా స‌రే.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు, సిరీస్‌ల‌ను ఆద‌రిస్తారు.

ఇక ‘సిన్’ సిరీస్ విష‌యానికి వ‌స్తే.. ద‌ర్శ‌కుడు చెప్ప‌ద‌ల‌చుకుంది ఒక‌టే.. ఎన్నో వంద‌ల సంవ‌త్స‌రాలుగా మ‌హిళ‌లు అణ‌చివేత‌కు గుర‌వుతున్నార‌ని.. వారికంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయ‌ని.. వాటిని గౌర‌వించాల‌ని.. వారి అనుమ‌తి లేనిదే.. వారు భార్య అయినా స‌రే.. వారితో శృంగారం చేయ‌రాద‌ని.. ఇందులో చూపించాల‌నుకున్నారు. కొంత వ‌ర‌కు ద‌ర్శ‌కుడు ఆ ప్ర‌యత్నంలో స‌ఫ‌లం అయ్యాడు కూడా. కానీ హిందీలో వ‌చ్చే సిరీస్‌ల‌తో పోలిస్తే.. ఈ సిరీస్‌లో ఎక్క‌డో ఏదో తేడా కొట్టింది. సీన్ల‌లో పాత్ర‌ధారులు మాట్లాడే మాట‌ల‌కు.. బ్యాక్‌గ్రౌండ్‌లో వ‌చ్చే మాట‌ల‌కు కొంత లాగ్ ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. అలాగే పలు సీన్లలో న‌టీన‌టులు ఏదో బ‌ట్టీ ప‌ట్టి డైలాగులు చెప్పిన‌ట్లు అనిపిస్తుంది. నిజానికి ఇందులో నటించిన వారు దాదాపుగా కొత్త‌వారు ఏమీ కాదు. అయినా న‌ట‌న ప‌రంగా కొన్ని సీన్లు చాలా కృత్రిమంగా అనిపిస్తాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ సిరీస్ ఓ మోస్త‌రుగా బాగానే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

కాగా ఈ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ నిర్మించ‌గా.. నవీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో జాగ్వార్ ఫేమ్ దీప్తి స‌థితోపాటు జార్జ్ రెడ్డి ఫేమ్ తిరువీర్ లు న‌టించారు. అయితే ఆల్ట్ బాలాజీ వంటి యాప్‌ల‌లో ఉన్న అడ‌ల్ట్ సిరీస్‌ల‌తో పోలిస్తే సిన్ సిరీస్‌లో ఆ మోతాదు మ‌సాలా సీన్లు లేవు. కానీ కొంత వ‌ర‌కు ఆ సీన్ల‌ను చొప్పించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ద‌ర్శ‌కుడు చెప్ప‌ద‌ల‌చుకున్న స్టోరీ స‌మాజానికి మంచి మెసేజ్ ఇచ్చేది అయితే.. అందులో అలాంటి సీన్లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంది..? అన్న‌ది ఇక్క‌డ అస‌లు ప్ర‌శ్న‌.. మ‌రి వ‌చ్చే సీజ‌న్ల‌లో ఘాటు డోసు పెంచుతారో.. ఇలాగే.. అక్క‌డ‌క్క‌డా.. కొన్ని సీన్ల‌ను చొప్పించే ప్ర‌య‌త్నం చేస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news