వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టేనా?

-

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇటీవల ప్రధాని రెండోసారి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదని, అనుకోని విపత్తు వల్ల పరిస్థితులు దారుణంగా మారాయని ప్రధాని మోదీ విన్నవించారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో ఇవ్వాల్సిన జీతాల్లో 50 శాతం వాయిదా వేసినట్టు మోదీకి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోని ఆదుకోవాలని కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిన మరసటి రోజే.. కేంద్రం అనుహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు విపత్తు సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతలో రూ. 11,092 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర కరోనా నివారణ చర్యలకు వినియోగించుకోవచ్చని తెలిపింది. అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు.. 13 రాష్ట్రాల రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు రూ. 6,157.74 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి విపత్తు సహాయ నిధి కింద రూ. 559.50 కోట్లు, రెవెన్యూ లోటు కింద రూ. 491.41 కోటు​ కేటయించబడ్డాయి. మొత్తంగా ఏపీకి రూ. 1,050.91 కోట్లు నిధులు దక్కినట్టయింది.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న ఏపీకి ఈ నిధులు పూర్తి స్థాయి లోటును భర్తీ చేయకపోయినప్పటికీ.. అపత్కకాలంలో కేంద్రం నుంచి గొప్ప సాయం లభించినట్టే భావించాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఏపీకి మాత్రం నిధుల పరంగా కేటాయింపులు బాగానే జరిగాయనే మాట వినిపిస్తుంది. ఇక.. రెవెన్యూ లోటు లేని పక్క రాష్ట్రం తెలంగాణకు విపత్తు సహాయ నిధి కింద కేంద్రం రూ. 224.50 కోట్లు ఇచ్చింది. ఏపీకి మాత్రం ఇందుకు రెట్టింపు స్థాయిలో నిధులు కేటాయించారు. ఏ రకంగా చూసినా ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు.. ఏపీకి కేటాయింపుల పరంగా న్యాయం జరిగిందనే చెప్పాలి. ఇవన్నీ చూస్తే సీఎం జగన్‌ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టుగానే తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news