రాత్రిపూట బిడ్డ ఏడుపు వినగానే ప్రతి తల్లిదండ్రి గుండె పరుగులెడుతుంది. నిద్ర లేమి, ఆందోళన, ఇదొక పెద్ద సవాలు. మన చిన్నిారికి ఏం కష్టమొచ్చిందో ఏం చెప్పలేకపోతోందో అని తల్లడిల్లిపోతాం. కానీ ఈ ఏడుపు వెనుక చాలా వరకూ సాధారణ, పరిష్కరించదగిన కారణాలు ఉంటాయి. వారి ప్రతి ఏడుపు ఒక సందేశం. ఆ సందేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాత్రి నిద్రను ప్రశాంతంగా మార్చే పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం.
చిన్న పిల్లలు రాత్రంతా ఏడవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మొదటి మరియు ముఖ్యమైన కారణం ఆకలి. ముఖ్యంగా మొదటి ఆరు నెలల వయస్సు ఉన్న పిల్లల కడుపు చిన్నదిగా ఉంటుంది కాబట్టి వారు ప్రతి కొన్ని గంటలకు పాలు అవసరమవుతాయి. రెండవది తడి డైపర్ లేదా అసౌకర్యం. తడి డైపర్ చర్మానికి చికాకు కలిగించడం లేదా బిగుతైన దుస్తులు అసౌకర్యాన్ని కలిగించడం వల్ల కూడా పిల్లలు ఏడుస్తారు. మూడవ ప్రధాన కారణం కొలిక్.

సాధారణంగా సాయంత్రం లేదా రాత్రిపూట వచ్చే ఈ కడుపు నొప్పి వల్ల పిల్లలు తీవ్రంగా ఏడుస్తారు. ఇది జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. నాల్గవది అలసట లేదా అతి ఉద్దీపన. పిల్లలు పగలు ఎక్కువగా ఆడి అలసిపోయినా లేదా చుట్టూ ఉన్న వాతావరణం అతిగా ఉద్దీపన చేసినా రాత్రి సరిగ్గా నిద్రపోలేక ఏడుస్తారు. ఐదవది పళ్ళు రావడం. దంతాలు చిగుళ్ళ నుంచి బయటకు వచ్చే సమయంలో నొప్పి మరియు అసౌకర్యం కారణంగా రాత్రంతా ఏడుస్తారు. చివరికి వారు కేవలం తల్లిదండ్రుల సామీప్యతను, భద్రతను కోరుకుంటారు.
ఈ ఏడుపును తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందించడానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. మొదటిది, సరైన నిద్ర దినచర్య పాటించడం. ప్రతి రోజు ఒకే సమయంలో వెచ్చని స్నానం, పాలు పట్టడం, మరియు చిన్న జోలపాట వంటివి అలవాటు చేయడం వల్ల, పిల్లలకు నిద్రపోయే సమయం వచ్చిందని తెలుస్తుంది. రెండవది “ఫైవ్ ఎస్” పద్ధతిని పాటించడం (స్వడ్లింగ్, సైడ్/స్టమక్ పొజిషన్, శ్ష్ శబ్దం, స్వింగింగ్, సకింగ్).
ఇది నవజాత శిశువులను తల్లి గర్భంలో ఉన్న అనుభూతిని ఇచ్చి, త్వరగా శాంతింపజేస్తుంది. మూడవది, కొలిక్ లేదా గ్యాస్ సమస్య ఉంటే, పాలు ఇచ్చిన తర్వాత తేన్పు వచ్చేలా చూడటం, లేదా డాక్టర్ సలహా మేరకు మసాజ్ చేయడం మంచిది. పళ్ళు వస్తున్నట్లయితే నొప్పిని తగ్గించడానికి టీథింగ్ రింగ్స్ ఇవ్వవచ్చు. చివరిగా బిడ్డ ఏడుస్తున్నప్పుడు శాంతంగా, సున్నితంగా స్పందించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రుల ఓదార్పు, స్పర్శ బిడ్డకు అత్యంత భద్రతను ఇస్తుంది ఇది మంచి నిద్రకు తొలి మెట్టు.
గమనిక: పిల్లలు ఏడుస్తున్నప్పుడు కంగారు పడకుండా మొదట వారి ప్రాథమిక అవసరాలైన ఆకలి, డైపర్ మార్పు వంటివి తీర్చాలి. జ్వరం లేదా వాంతులు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
