ఒక దేశం ఆర్థికంగా బలంగా, స్వయం సమృద్ధిగా ఉండాలంటే దాని ఉత్పత్తి రంగం (Manufacturing Sector) బలంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే భారత ప్రభుత్వం 2014లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం మరియు దేశీయ పరిశ్రమలకు కొత్త ఊపు ఇవ్వడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. మరి ఈ ప్రచారం దేశీయ ఉత్పత్తికి ఎలా కొత్త దిశానిర్దేశం చేసిందో మరియు ఎలాంటి మార్పులు తెచ్చిందో తెలుసుకుందాం..
‘మేక్ ఇన్ ఇండియా’ అనేది కేవలం ఒక నినాదం కాదు, ఇది భారతదేశంలో తయారీ (Manufacturing) మరియు పెట్టుబడుల కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన ఒక విప్లవాత్మక కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను భారతదేశంలో తమ ఉత్పత్తులను తయారు చేయమని ఆహ్వానించడం అదే సమయంలో దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం. దీని ద్వారా దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడం సాంకేతిక పరిజ్ఞానం (Technology) బదిలీ కావడం మరియు ఎగుమతులు పెరగడం వంటి లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి.
ఈ కార్యక్రమం మొదలైన తర్వాత ప్రభుత్వం వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడానికి, అనుమతులను వేగవంతం చేయడానికి మరియు లైసెన్సింగ్ విధానాలను సరళీకృతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా ప్రపంచ బ్యాంక్ యొక్క ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్‌లలో భారతదేశం గణనీయంగా మెరుగుపడింది. రక్షణ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మరియు టెక్స్‌టైల్స్ వంటి 25 కీలక రంగాలపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.

ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులు (FDI) పెరిగాయి మరియు దేశీయ సంస్థలు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రోత్సాహం పొందాయి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ తయారీలో, ముఖ్యంగా మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం ప్రపంచంలోనే ప్రముఖ కేంద్రంగా మారుతోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి మద్దతుగా ఈ కార్యక్రమం బలంగా నిలిచింది. దేశీయంగా తయారైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం మరియు వాటిని ప్రపంచ మార్కెట్లలో పోటీపడేలా చేయడంపై దృష్టి పెట్టింది. ‘మేక్ ఇన్ ఇండియా’ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిచ్చి, స్వయం సమృద్ధి వైపు వేగంగా నడిపిస్తోంది.
‘మేక్ ఇన్ ఇండియా’ కేవలం ఆర్థిక విధానం మాత్రమే కాదు ఇది భారతీయ ఉత్పత్తి సామర్థ్యంపై మరియు యువత శక్తిపై ప్రభుత్వానికి ఉన్న అపారమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం దేశీయ పరిశ్రమకు కొత్త ఊపునిచ్చి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక తయారీ శక్తి కేంద్రంగా నిలబెట్టే దిశగా నడిపిస్తోంది.
