ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు కాగా.. 60వేల మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇక చైనాలోని వూహాన్ సిటీలో మొదటగా పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతటా వ్యాపించింది. అయితే ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని దేశాలు ఏమైనా ఉన్నాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది.
పసిఫిక్ మహాసముద్రంలోని పలు ద్వీపాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సాలమన్ దీవులు, వనాటు, సమావో, కిరిబతి, మైక్రోనేషియా, తొంగా, మార్షల్ దీవులు, పాలౌ, తువలు, నౌరు తదితర దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక ఉత్తర కొరియా, యెమెన్, తుర్కెమెనిస్థాన్, తజకిస్థాన్ దేశాల్లోనూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే అన్ని దేశాల సంగతి ఓకే కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
ఉత్తరకొరియా చైనాకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కరోనా వచ్చిన వారిని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ కాల్చి పారేయిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అందుకు ఆధారాలు లేవు. అలాగే అక్కడ అసలు ఏం జరుగుతుందనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఇక ఈ ఒక్క దేశాన్ని పక్కన పెడితే కరోనా వ్యాపించని ఆయా దేశాల్లో అమల్లో ఉన్న కఠిన ట్రావెల్ నిబంధనలే.. వైరస్ రాకుండా ఉండేందుకు గల కారణాలని పలువురు చెబుతున్నారు. ఏది ఏమైనా.. కరోనా మహమ్మారి మాత్రం ప్రపంచంలో దాదాపుగా ఏ దేశాన్నీ వదల్లేదు. ఈ వ్యధ ఇంకా మనకు ఎన్ని రోజులు ఉంటుందో.. చూడాలి..!