అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ట్రస్టు రామాలయ నిర్మాణానికి సంబంధించిన డ్రాఫ్ట్ వర్క్‌లో నిమగ్నమైంది. తాజాగా బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో రామాలయ ట్రస్ట్ తన అధికారిక లోగోను విడుదల చేసింది.
ఈ లోగోలో సూర్య కిరణాల మధ్య బాణాలు ధరించిన రామునితో పాటుగా ఆయన్ని పూజిస్తున్న ఆంజనేయుడి చిత్రాన్ని కూడా పొందుపరిచారు. ఇంకా సంస్కృతంలో రామో విగ్రహ్వాన్ ధర్మం అని కూడా రాశారు. అంటే రామ విగ్రహం మతం అని అర్థం వస్తుందని రామాలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అయితే కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాతే అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని విశ్వ హిందూ పరిషత్ స్థానిక ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు.
కాగా,ఇటీవల చైత్ర నవరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆదిత్యనాథ్ స్వయంగా తన చేతుల మీదుగా రామ జన్మభూమి ప్రాంగణంలోని మాసస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు.