చేతిలో నెల రోజుల బిడ్డతో కరోనాపై పోరు.. జీవీఎంసీ కమిషనర్‌ సృజన

-

మహిళకు మాతృత్వం కన్నా మరేదీ ముఖ్యం కాదని అంటారు. కానీ విశాఖపట్నం మహానగరపాలక సంస్థ కమిషనర్‌ జి సృజన మాత్రం మాతృత్వం, వృతి ధర్మం సమానమేనని అంటున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ వేళ విధులకు హాజరవుతూ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనించారు. ప్రసవం ముందు రోజు వరకు విధులకు హాజరైన సృజన.. బిడ్డ పుట్టాక మూడు వారాలకే తిరిగి విధుల్లో చేరారు. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వేళ విధులను నిర్వర్తించడానికి.. 22 రోజుల పసికందు బాధ్యతను ఇంట్లో వాళ్లకి అప్పజెప్పారు.

ప్రసవించిన తరువాత ఆరు నెలల పాటు సెలవు తీసుకునే వెసులుబాటు ఉన్నా కరోనా నేపథ్యంలో ఆమె విధుల్లో చేరారు. విశాఖలో కరోనా కట్టడితో తన వంతు సాకారం అందిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌గా విశాఖ పరిధిలోని అధికారులను అప్రమత్తం చేస్తూ.. పారిశుద్ధ్యం పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా తన నెల రోజు బిడ్డను చేతిలో పట్టుకునే అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని ఆమె కోరుతున్నారు. భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తి అరికట్టవచ్చని తెలిపారు. విశాఖలోని వలస కూలీలకు వసతి, ఆహారం అందజేస్తున్నామని చెప్పారు. కాగా, గతేడాది జూన్‌లో ఆమె జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

సృజనకు కృతజ్ఞతలు తెలిపిన తేజశ్వి యాదవ్‌..
బిహార్‌ వాసులకు సాయం చేసినందుకు కొద్ది రోజుల కిందట ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలేజీ హాస్టల్‌ నుంచి బయలుదేరి బిహార్‌ రాలేక నగరంలోని పలు హోటల్స్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని తేజశ్వి యాదవ్‌ ట్విట్టర్‌ ద్వారా కమిషనర్‌ సృజనకి తెలియజేశారు. కమిషనర్‌ వెంటనే స్పందించి నగరంలోని హోటల్స్‌లో జల్లెడపట్టగా 17 మంది విద్యార్థుల ఆచూకీ గుర్తించి వైద్య పరీక్షల అనంతరం కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి తిరిగి హాస్టల్‌కి పంపించారు. దీంతో కమిషనర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news