“ఇంటివద్దకే మద్యం” నోరూరిందో ఏమో..లక్షలు గోవింద

-

ప్రభుత్వం మద్యం షాపులు, బార్లు, పబ్బులు క్లోజ్ చేసి చాలా రోజులు అయిపోయిందని నాలుక పీకేస్తుందో, ఇళ్లల్లో దాచుకున్న స్టాక్ కూడా లక్కీ డ్రాప్ తో సహా అయిపోవస్తోందో… అదీకాకుండా మందుబాబుల బలహీనతను అడ్డుపెట్టుకుని మూడు నాలుగు రెట్లుకు పైగా సంపాదించేద్దామనో తెలియదు కానీ… ఆన్ లైన్ లో మద్యంపై ఆసక్తి చూపించారు కొందరు హైదరాబాదీలు! మీ ఇంటికే మద్యం పంపుతాం… అనే సరికి నరాలు ఉప్పొంగాయో లేక, నోట్లో లాలాజలం ఊరిందో కానీ… ఇక ఏమాత్రం వెనక్కి చూడకుండా ఆర్డర్ చేసేశారు… అనంతరం తాగకుండానే హ్యాంగోవర్ కి బలయ్యారు!

“ఇంటి వద్దకే మద్యం.. డోర్ డెలివరీ ఆఫర్ మీకోసం ప్రత్యేకం”.. అంటూ వచ్చిన ఒక ప్రకటనపై మనసుపడ్డారు ఇద్దరు హైదరాబాదీలు! కాకపోతే… ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించాలి! ఏముందిలే… ఈ రోజుల్లో రెండు ఇడ్లీలు ఇంటికి తెప్పించుకున్నా కూడా పేమెంట్స్ ఆన్ లైన్ లోనే కదా చేసేది అనుకున్నారో ఏమో… లక్షల్లో చెల్లించేశారు. అవును… యాకుత్ పురాకు చెందిన ఓ వ్యక్తి రూ.3.27 లక్షలు, మెహిదీపట్నంకు చెందిన మరో వ్యక్తి రూ.48 వేలు ఈ “ఇంటివద్దకే మద్యం” బ్యాచ్ కి చెల్లించారు. పార్టీలకో, వ్యాపారానికో ప్లాన్స్ చేసేసుకుని అంతా రెడీ అయిపోయి ఎంతకాలం అవుతున్నా మద్యం మాత్రం ఇంటికి రావడం లేదు!

దీంతో అప్పటికి కాస్త జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ… తాము నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు గుర్తించి సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం దొరక్క మందుబాబులు ఓవైపు వెర్రెక్కిపోతుంటే.. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు తెలివిగా బుట్టలో వేసుకుంటున్నారు. నాలుగు రోజులు ఆగండ్రా బయ్… ఎందుకు ఇలా? అంటూ ఈ వ్యవహారంపై ఆన్ లైన్ వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news