నేడు ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛా దినోత్స‌వం.. భార‌త్‌లో ప‌రిస్థితి ఏంటి..?

-

పేరుకే అది ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛా దినోత్స‌వం.. వ‌ర‌ల్డ్ ప్రెస్ ఫ్రీడం డే.. కానీ ఇంకా అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో అస‌లు ప‌త్రిక‌ల‌కు.. మీడియాకు ఇంకా స్వేచ్ఛ లేదు. ఫ‌లానా రాజ‌కీయ పార్టీ గురించి రాయాలంటే జ‌ర్న‌లిస్టుల‌కు భ‌యం.. ఎక్క‌డ ఆ పార్టీ వారు వ‌చ్చి దాడి చేస్తారోన‌ని.. ఫ‌లానా నేత అవినీతి గురించి జ‌నాల‌కు చెప్పాల‌న్నా భ‌య‌మే.. ఎక్క‌డ త‌మ‌ను చంపేస్తారేమోన‌ని.. జ‌ర్న‌లిస్టులు ఇంకా భ‌య‌ప‌డుతూనే ఉన్నారు. ఇక వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌నీయ‌కుండా మీడియా సంస్థ‌ల‌ను భ‌య‌పెడుతున్న రాజ‌కీయ నాయ‌కులు, బ‌డాబాబులు చాలా మందే ఉన్నారు. దీంతో మ‌న దేశంలో ప‌రిస్థితులు ఇంకా మెరుగుప‌డడం లేదు. వ‌రల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో భార‌త్ 142వ స్థానంలో ఉందంటే.. మ‌న దేశంలో జ‌ర్న‌లిస్టులు, మీడియా సంస్థ‌ల‌కు ఏపాటి స్వేచ్ఛ ల‌భిస్తుందో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

world press freedom day what is the position in india

అయితే ప్ర‌పంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒక‌టైన న‌మీబియా స‌ద‌రు ఇండెక్స్‌లో 28వ స్థానంలో ఉండ‌డం విశేషం. అక్క‌డి జ‌ర్న‌లిస్టులు ప్ర‌భుత్వాల త‌ప్పుల‌ను ఎత్తి చూపేందుకు అవ‌స‌రం అయితే త‌మ ప్రాణాల‌ను కూడా అర్పించేందుకు సిద్ధంగా ఉంటార‌ట‌. అలాగే జ‌ర్న‌లిస్టులు కూడా నిజాల‌ను చెప్పేందుకు ప్ర‌భుత్వాలు వారికి స‌హ‌కారం అందిస్తాయ‌ట‌. అందుక‌నే ఆ ఇండెక్స్‌లో న‌మీబియా ఆ స్థానంలో ఉంది. ఇక ఆ జాబితాలో మ‌న దాయాది దేశాలైన‌ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు 145, 151 స్థానాల్లో ఉన్నాయి. అలాగే యూకే, అమెరికాలు ఆ ఇండెక్స్‌లో 33, 48 స్థానాల్లో నిలిచాయి.

 

ఇక ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛా దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌లైన ఆ ర్యాంకింగ్‌ల ప‌ట్ల బీజేపీ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఎవ‌రో కావాల‌నే ఇలా ర్యాంకులు ఇచ్చార‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇక కాంగ్రెస్ మాత్రం.. దేశంలో మీడియా సంస్థ‌ల స్వేచ్ఛను ఎలా హ‌రిస్తున్నారో తెలియ‌జేసేందుకు ఈ ర్యాంకులే ఉదాహ‌ర‌ణ అని స్ప‌ష్టం చేసింది. ఏది ఏమైనా.. ఒక్కటి మాత్రం నిజం.. మ‌న దేశంలో డ‌బ్బు, రాజ‌కీయాలు పెత్త‌నం చేసినంత‌ కాలం.. మీడియా సంస్థ‌ల‌కు స్వేచ్ఛ అస‌లే ఉండ‌దు.. అది అంద‌రికీ తెలిసిన స‌త్యం..!

Read more RELATED
Recommended to you

Latest news