పశువుల్లో వచ్చే లంపి స్కిన్ వ్యాధి గురించి మరిన్ని విషయాలు..!!

-

పశువుల్లో వచ్చే వ్యాధులలో లంపి స్కిన్ వ్యాధి అతి భయంకరమైన వ్యాధి..ఈ మధ్య కాలంలో ఈ వ్యాధి గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఇది మనుషులకు ఎటువంటి హానీ కలిగించక పోయిన కూడా పశువులకు మాత్రం వేగంగా వ్యాపిస్తుంది.ఇప్పటికే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా 57,000 పశువుల మరణాలకు కారణమైంది. ఇప్పటి వరకు 15.21 లక్షల పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఢిల్లీతో సహా కనీసం ఏడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

ఈ వ్యాధి వచ్చిన జంతువులను, వ్యాధి సోకని జంతువుల నుండి వేరు చేయడానికి,వ్యాధి వ్యాప్తిని ఆపడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సిఫార్సు చేసింది.ఇప్పటికే రాజస్థాన్ మరియు గుజరాత్‌లలో, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, సమర్థవంతమైన నివారణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వైరల్ వ్యాధి కారణంగా, ఈ రెండు రాష్ట్రాల్లో ఆగస్టులోనే సుమారు 3,000 పశువులు చనిపోయాయి..

ఈ వ్యాధిని ముద్ద చర్మపు వ్యాధి అని కూడా పిలుస్తున్నారు. లంపి స్కిన్ డిసీజ్ అనేది కాప్రిపాక్స్ వైరస్ వల్ల పశువులు మరియు గేదెలకు వచ్చే వైరల్ వ్యాధి. ఇది కొన్ని జాతుల ఈగలు, దోమలు లేదా పేల వంటి రక్తాన్ని తాగే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, చర్మంపై బుడిపెలుకు కారణమవుతుంది. చివరకు మరణానికి కూడా దారి తీస్తుంది. లంపి స్కిన్ డిసీజ్‌కి చికిత్స లేదు. ఒక ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పశువులు సోకిన వాహకాలు ఈగలు మొదలైనవి దాడి చేయకుండా ఆపడం మాత్రం కష్టం..

వ్యాధి సోకిన పశువు యొక్క నోరు, కంటి నుంచి కారే స్రావాలలో వైరస్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ స్రావాలు పశువుల మేత, నీటి తొట్టెలను వైరసుతో కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి సోకిన ఆబోతు వీర్యంలో కూడా వైరస్‌ విసర్జించబడుతుంది. అయితే, ఈ వ్యాధి సహజ సంపర్కం, కృత్రిమ గర్భధారణ ద్వారా కూడా ఆడ పశువులకు వచ్చే అవకాశం ఉంది. పాలు త్రాగే దూడలకు తల్లి పాల ద్వారా లేదా పొదుగు పై ఉన్న చర్మం పొక్కుల ద్వారా వ్యాధి ఇతర పశువులకు వచ్చే ప్రమాదం ఉంటుంది..అందుకే ఆ వ్యాధి తీవ్రత ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

పశువు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించటానికి 5 రోజుల నుండి 10 రోజులు పడుతుంది. ఈ వ్యాధి సోకినపుడు 104-105 డిగ్రీల ఫారెన్హీట్‌ వరకు జ్వరం, కళ్ళ నుండి, ముక్కు నుండి నీరు కారడం, నోటి నుండి చొంగ కారటం ఈ వ్యాధి మొదటి లక్షణం. తరువాత చర్మం కింద, నోటి చిగురు, ముట్టె మీద, ముక్కుదూలం మీద, కణితులు,బుడిపెలు వంటివి ఏర్పడతాయి. దీనితో పాటు మెడ మరియు తొడల దగ్గర లింఫ్‌ గ్రంధులు వాచి, పొదుగు, రొమ్ము భాగం, కీళ్లలో నీరు చేరి పశువు నీరంసంగా మారుతుంది.ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే పాడి రైతులు సమీపంలోని పశువైద్యులను సంప్రదించటం మంచిది. తద్వారా సకాలంలో పశువులకు చికిత్సను అందించటం ద్వారా అవి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.. ముందు పశు వైద్యులను సంప్రదించాలి.. వ్యాధి గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news