ఈ దోస్తులు.. రైతులకు నేస్తాలు.. సౌరశక్తితో వినూత్న ఆవిష్కరణలు

-

ఈ రోజుల్లో చదువుకున్న యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది. రైతుల కష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయానికి సాంకేతికత తోడైతే మంచి లాభాలు ఉంటాయనేది అందరూ అనే మాట.. అదే నిజం చేసి చూపించారు ఈ ఇద్దరు స్నేహితులు.

మినుశ్రీ మధుమిత, అమృత ఇద్దరూ పదోతరగతి వరకూ కలిసే చదువుకున్నారు. ప్రాణ స్నేహితులు. స్వస్థలం ఒడిశాలోని కలహండి. మిను రసాయనశాస్త్రంలో పీజీ చేస్తే… అమృత ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. చదువైన తర్వాత.. దిల్లీలో ఉద్యోగాలు సంపాదించారు. కొన్నిరోజులకే మినుశ్రీకి తన ఉద్యోగ ప్రయాణం విసుగు పుట్టింది. తను పుట్టి పెరిగిన సమాజానికి తనవంతుగా సేవ చేయాలన్న తపనతో..ఒడిశాలో బిహాంగ్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది.

గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యని చేరువ చేయడమే ఈ సంస్థ లక్ష్యం.. ప్రభుత్వ పాఠశాలలు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవి. దానికి తోడు ఇక్కడ విద్యుత్‌ కోతలు ఎక్కువ. అప్పుడే తన ఆలోచన సౌర ఉత్పత్తుల వైపు మళ్లింది. ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా అందించే నిధుల సాయంతో సౌరశక్తితో నడిచే కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఒడిశాలో నిర్వహించింది.

2016లో థింక్‌రా సంస్థని ప్రారంభించారీ స్నేహితురాళ్లు.. మొదట్లో విద్యార్థుల కోసం కంప్యూటర్‌ ల్యాబుల నిర్వహణకు అవసరమైన సౌర ఫలకాలు తయారుచేయాలనుకున్నారు. అప్పుడే రైతులకోసం ఏదైనా చేయాలనే ఆలోచన వారిద్దరిలో మొదలైందట. కలహండిలో వ్యవసాయం ఎప్పుడూ నష్టాలనే మిగిల్చేది. నిజానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఏమాత్రం అవగాహన ఉన్నా ఆ నష్టాలు నివారించదగ్గవే అన్నది ఈ స్నేహితురాళ్ల అభిప్రాయం.

అందుకే క్రిషి ధను, ధీవరమిత్ర, మత్స్యబంధు అనే పరికరాలను ఆవిష్కరించారు. ‘సాధారణంగా పొలాల్లో ఎరువులని స్త్రీలు చేత్తో చల్లుతుంటారు. ఇలా చల్లడం వల్ల చేతికి అలర్జీలు వస్తాయి. పైగా ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ పడి డబ్బు కూడా వృథా అవుతుంది. అలాకాకుండా సోలార్‌ ప్యానెల్‌తో ఛార్జ్‌ అయిన క్రిషి ధను పరికరాన్ని వీపునకు కట్టుకొని ఎరువులని పొలమంతటా సమానంగా చల్లొచ్చు. ఘన రూపంలో ఉన్న ఎరువులని కూడా చల్లడం ఈ పరికరం ప్రత్యేకత.

గర్భిణులు కూడా ఈ పరికరాన్ని తేలిగ్గా మోయగలిగేలా దీన్ని తయారుచేశారు.. సాధరణంగా.. చెరువులో చేపల సాగులో ఆక్సిజన్‌ స్థాయులను స్థిరీకరించేందుకు కొన్ని పరికరాలని వాడతారు. అవి నడవడానికి ప్రధానంగా డీజిల్‌ని వినియోగిస్తారు. ఈ శిలాజ ఇంధనాల వినియోగానికి అడ్డుకట్టవేసేందుకు తయారుచేసిన పరికరమే ధీవరమిత్ర. సోలార్‌ ప్యానెల్‌ అమర్చిన పరికరాలు చెరువులో తేలుతూ.. ఆక్సిజన్‌ స్థాయిలో తేడా రాకుండా చూసి చేపలు పెద్ద మొత్తంలో చనిపోకుండా కాపాడతాయి.

ఇక మత్య్సబంధు అయితే చేపలకు వేసే ఆహారం ఎక్కువ తక్కువలు కాకుండా చూసి రైతులకు నష్టం రాకుండా చేస్తుందట. ఈ ఆవిష్కరణలతో రైతులు 35 శాతం మేర నష్టం తగ్గించుకున్నారంటున్నట్లు వీళ్లు చెబుతున్నారు. అనుకుంటే ఏదైనా సరే సాధించి తీరగలుగుతాం అని ఈ స్నేహితులు మరోసారి నిరూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news