కూరగాయల సాగులో నీటి యాజమాన్య పద్ధతులు..!

-

మొక్కలకు నీరు సమృద్దిగా ఉంటేనే అవి ఏపుగా ఎదుగుతాయి. అప్పుడే మంచి దిగుబడి ఉంటుంది. ముఖ్యంగా కాయగూరలు సాగుచేస్తున్న రైతులు సకాలంలో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు మనం కూరజాతి పంటలవారీగా నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందామా..!

క్యారెట్: నేల స్వభావం, వాతావరణం పరిస్ధితులను బట్టి 7 రోజుల కు ఒకసారి నీరు అందించాలి. దుంప పెరుగుదల దశలో తగినంత తేమ ఉండాలి. తేమ ఎక్కవగా ఉంటే క్యారెట్ నాణ్యతపై ప్రభావం పడుతుంది.

వంగ: ఈ పంటకు నారు నాటే ముందు లేదా నాటిన తరువాత నీటిని ఇవ్వాలి. నేలలో తేమను బట్టి వారానికి ఒక సారి వేసవిలో 4 రోజులకొకసారి తడి ఇవ్వాలి. పూత, కోత దశలో నేలలో తేమ ఉండాలి. లేదంటే పూత రాలిపోతుంది. వేసవిలో అయితే.. కాయ కోతకు ఒక రోజు ముందే నీటి తడి ఇవ్వాలి. లేదంటే కాయలో చేదు శాతం పెరుగుతుంది.

టమోటా; టమోటా సాగు చేసే రైతులు వేసవిలో పంటను కాపాడుకునేందుకు సకాలంలో నీటి తడులు ఇవ్వటం చాలా ముఖ్యం.. వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వటం వల్ల పంటను కాపాడుకోవచ్చు.

క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్: ఈ రెండు పంటలకు.. నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం ఆపాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం లేకపోలేదు. ఈ రెండు పంటలకు నీటిని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.

మిరప: ఈ పంట అధిక తేమను, బెట్టను తట్టుకోలేదు. తేమ పెరిగితే పూత రాలిపోతుంది. తెగుళ్లు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. బెట్టకు గురైనప్పుడు పూత రాలడంతోపాటు కొత్త రెమ్మలు కూడా ఏర్పడవు. నల్ల రేగడి నేలల్లో 3వారాలకు ఒకసారి , తేలిక నేలల్లో 15 రోజులకు ఒక సారి , వేసవి
పంటలో 6 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది.

చిక్కుడు: పందిరి రకాలకు పాదులో మట్టి 3 సెంటీమీటర్ల లోతులో ఎండినప్పుడు నీరు ఇవ్వాల్సి ఉంటుంది.. పాదుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. చిక్కుడు, గోరుచిక్కుడు కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతాయి. ఫ్రెంచి చిక్కుడు అధిక తేమను, నీటి ఎద్దడిని తట్టుకోలేవు. 7 నుండి 10 రోజుల కొకసారి నేల స్వభావాన్ని బట్టి నీరు అందించాల్సి ఉంటుంది.

ఉల్లి: ఉల్లికి తరుచుగా నీరు అందిస్తుండాలి. నారు దశలో వారం వ్యవధిలో రెండు సార్లు నీరు ఇవ్వాలి. తరువాత 60 రోజుల వరకు 12 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. గడ్డ ఊరే సమయంలో 7 రోజుల వ్యవధిలో 7 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందు నీరు ఇవ్వటం ఆపాలి. ఖరీఫ్‌లో 8, రబీలో 12, వేసవిలో 15 సార్లు నీటి తడి ఇవ్వాలి. గడ్డ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవడం ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news