స్కూళ్లు, కాలేజీల్లో చాక్‌పీసుల అవసరం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇండ్లలోనూ పలువురు మహిళలు ముగ్గులు వేసేందుకు, ఇతర అవసరాలకు చాక్‌పీస్‌లను వాడుతుంటారు. అయితే ప్రధానంగా స్కూళ్లు, కాలేజీల్లోనే వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ మార్కెట్‌ను బేస్ చేసుకుని చాక్‌పీస్‌లను తయారు చేసి విక్రయిస్తే.. చక్కని ఆదాయం పొందవచ్చు. మరి ఇందుకు ఏమేం కావాలో, ఏ మేర ఈ బిజినెస్‌లో లాభాలు పొందవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
చాక్‌పీస్‌ల తయారీకి మౌల్డ్స్ (అచ్చులు) కావాలి. వీటి ధర రూ.2వేల నుంచి రూ.6వేల వరకు ఉంటుంది. వీటిలో ఎక్కువ ధర ఉన్న మౌల్డ్స్‌తో ఒకేసారి ఎక్కువ చాక్‌పీస్‌లను తయారు చేయవచ్చు. ఇక చాక్‌పీస్‌ల తయారీకి చాక్ మేకింగ్ పౌడర్, ప్యాకింగ్ బాక్సులు, సెలో టేపులు అవసరం అవుతాయి. చాక్ మేకింగ్ పౌడర్‌ను నిర్ణీత పరిమాణంలో నీటితో కలిపాక ఆ ద్రావణాన్ని అచ్చుల్లో పోస్తే.. కొంత సేపటికి అవి గట్టి పడి చాక్ పీసులు తయారవుతాయి. ఇక 1 కేజీ చాక్ మేకింగ్ పౌడర్ ఖరీదు రూ.15 వరకు ఉంటుంది. అలాగే ప్యాకింగ్ బాక్సులు ఒక్కొక్కటి రూ.1 కి లభిస్తాయి. ప్యాకింగ్ కోసం వాడే సెలో టేప్‌కు రూ.3 వరకు ఖర్చవుతుంది. దీంతో 1 కేజీ చాక్‌పీస్‌ల తయారీకి దాదాపుగా రూ.30 వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో నిత్యం 50 కేజీల వరకు చాక్‌పీస్‌లను తయారు చేయవచ్చు.
ఇక 1 కేజీ చాక్ పౌడర్‌తో 240 చాక్‌పీస్‌లు తయారవుతాయి. వాటిని ఒక్కో బాక్సులో 20 చొప్పున పెడితే 12 బాక్సులు అవుతాయి. ఈ క్రమంలో ఒక్క బాక్సును రూ.5కు అమ్మినా 12 బాక్సులకు రూ.60 వస్తాయి. అందులోంచి ఖర్చు రూ.30 తీసేస్తే రూ.30 లాభం ఉంటుంది. ఈ క్రమంలో 1కేజీకి రూ.30 లాభం అనుకున్నా నిత్యం 50కేజీల చాక్‌పీసులను తయారు చేస్తే రూ.1500 వస్తాయి. నెలకు రూ.45వేలు సంపాదించవచ్చు.
అయితే చాక్‌పీస్ తయారీ బిజినెస్‌ను ఇంట్లోనే చేయవచ్చు. అందుకు ప్రత్యేకంగా రూం ఉండాలి. ఇందుకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. చాక్‌పీస్ అచ్చులు, ముడిపదార్థాలు కలిపి కనీసం రూ.5వేలతోనూ ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. ఇక అవసరాన్ని బట్టి కలర్ చాక్‌పీస్‌లను కూడా తయారు చేయవచ్చు. వాటికి ఆదాయం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలతోపాటు స్టేషనరీ, కిరాణా షాపులు, ఫ్యాన్సీ, బుక్ స్టోర్స్ తదితర వ్యాపారులతో టై అప్ అయితే.. చాక్‌పీస్‌లను నిత్యం ఎక్కువ మొత్తంలో సరఫరా చేయవచ్చు. దీంతో చక్కని ఆదాయం సంపాదించవచ్చు..!