కుందేళ్ల పెంప‌కంతో అక్ష‌రాలా నెల‌కు రూ.1 ల‌క్ష ఆదాయం పొంద‌వ‌చ్చు..!

-

ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవుల‌తోపాటు కుందేళ్ల‌ను కూడా పెంచి చ‌క్క‌ని లాభాల‌ను పొందుతున్నారు. కుందేళ్ల పెంపకం ఇప్పుడు చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మారింది. ఇంటి వ‌ద్ద స్థ‌లం ఉన్న‌వారు కుందేళ్ల‌ను చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. స్థ‌లం లేక‌పోయినా.. లీజుకు తీసుకుని మ‌రీ వాటిని పెంచితే వ్యాపారం లాభ‌సాటిగా మారుతుంది. చికెన్‌, మ‌ట‌న్‌తోపాటు ప్ర‌స్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది. అందువ‌ల్ల వాటిని పెంచి విక్ర‌యిస్తే.. చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు.

earn upto rs 1 lakh by doing rabbit farming

స్థ‌లం ఉన్న‌వారు ప్ర‌త్యేకంగా పాక‌ల‌ను నిర్మించి వాటిల్లో కుందేళ్ల‌ను పెంచ‌వ‌చ్చు. అలా కుద‌ర‌క‌పోతే బోన్లలోనూ వాటిని పెంచ‌వ‌చ్చు. ఇక ఇవి వ్య‌ర్థ‌మైన కూర‌గాయ‌లు, గింజ‌లు, ఇత‌ర ఆహారాలు, ఆకుల‌ను తిని జీవిస్తాయి. క‌నుక వీటికి ఆహారం అందించ‌డం చాలా తేలిక‌. అయితే వేస‌వి, వ‌ర్షాకాలం, చ‌లికాలంల‌ను త‌ట్టుకునే విధంగా బోన్లు, పాక‌ల‌ను నిర్మిస్తే.. కుందేళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే వాటికి ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించాలి. ఇక కుందేళ్ల‌కు టైముకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. సాధార‌ణంగా వాటికి బ‌లం కోసం తృణ ధాన్యాలు, చిక్కుడు గింజ‌లు, ప‌శువుల‌కు వేసే ప‌చ్చి గ‌డ్డి, క్యారెట్‌, క్యాబేజీ ఆకులు వంటి ఆహారాల‌ను ఇవ్వ‌చ్చు. దీంతో అవి బాగా ఎదుగుతాయి.

సాధార‌ణంగా కుందేళ్లు ప‌గ‌లు క‌న్నా రాత్రి పూట ఎక్కువ చురుగ్గా ఉంటాయి క‌నుక ఆ స‌మ‌యంలో ఆహారం వేస్తే అవి వృథా చేయ‌కుండా మొత్తం ఆహారాన్ని తినేస్తాయి. ఇక ఆడ కుందేళ్లు 5 నుంచి 6 నెల‌ల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి అవి సంతానాన్ని ఉత్ప‌త్తి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే మ‌గ కుందేళ్ల‌ను మాత్రం ఏడాది వ‌య‌స్సు వ‌చ్చాకే సంతానోత్ప‌త్తి కోసం ఉప‌యోగించాలి. దీంతో కుందేళ్లు బ‌ల‌వ‌ర్ధ‌కంగా ఉంటాయి. ఇక కుందేళ్లు 5 నుంచి 6 నెలల కాల‌వ్య‌వ‌ధిలో పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తాయి. త‌రువాత 6 వారాల‌కు అవి మ‌ళ్లీ సంతానాన్ని ఉత్ప‌త్తి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే కుందేళ్ల‌కు 12 వారాల వ‌య‌స్సు వ‌స్తే వాటిని విక్ర‌యించ‌వ‌చ్చు. ఆ స‌మ‌యంలో వాటి బ‌రువు క‌నీసం 2 కిలోలు ఉండేలా చూసుకుంటే చ‌క్క‌ని రేటు వ‌స్తుంది. దీంతో త‌క్కువ కుందేళ్ల‌ను అమ్మినా ఎక్కువ లాభం వ‌స్తుంది.

సాధార‌ణ కుందేళ్ల క‌న్నా గ‌ర్భం దాల్చిన కుందేళ్ల‌కు మ‌రింత పౌష్టికాహారం ఇవ్వాలి. వాటిని ప్ర‌త్యేకంగా చూసుకోవాలి. ఇత‌ర కుందేళ్ల‌ను వాటి వ‌ద్ద‌కు రానీయ‌కూడ‌దు. ఇక కుందేళ్ల‌కు స‌హ‌జంగా పాస్ట్యురెల్లోసిస్, పేగులకు సంబంధించిన రోగం (ఎంటిరైటిస్), మెడవాల్చు రోగం, స్తనముల వాపు రోగం (మాస్టిటిస్) వంటి వ్యాధులు వ‌స్తుంటాయి. క‌నుక వాటి ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మనిస్తుండాలి. ఏ కుందేలైనా అనారోగ్యానికి గురైతే దాన్ని ప్ర‌త్యేకంగా ఉంచి డాక్ట‌ర్‌చే చికిత్స‌నందివ్వాలి.

ఇక కుందేళ్లలో ప‌లు ర‌కాల జాతులు కూడా ఉంటాయి. జాతుల‌ను బ‌ట్టి కొన్ని కుందేళ్లు ఎక్కువ బ‌రువు తూగుతాయి. తెలుపు జైంట్‌, బూడిద రంగు జైంట్‌, ఫ్లెమిష్ సైంట్ ర‌కాల‌కు చెందిన కుందేళ్లు 4 నుంచి 6 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయి. వీటిని అమ్మితే లాభం ఎక్కువ‌గా వ‌స్తుంది. న్యూజిలాండ్ (తెలుపు, ఎరుపు), కాలిఫోర్నియా జాతుల‌కు చెందిన కుందేళ్లు త‌క్కువ బ‌రువు తూగుతాయి. ఇవి గ‌రిష్టంగా 4 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయి. వీటిని పెంచి అమ్మినా లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు.

ఇక సుమారుగా 200 కుందేళ్ల‌ను పెంచాలంటే క‌నీసం రూ.2 ల‌క్షల పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఆడ కుందేళ్లు అయితే ఒక్కొక్క‌టి 4 నుంచి 12 పిల్ల‌ల‌ను కంటాయి. దీంతో 200 కుందేళ్ల‌కు క‌నీసం 800 పిల్ల‌లు వ‌స్తాయి. ఇక ఒక్కో కుందేలు 40 నుంచి 120 రోజుల్లో 2 కేజీల బ‌రువు పెరుగుతాయి. దీంతో ప్ర‌తి 40 రోజుల‌కు ఒక బ్యాచ్ వస్తుంది. ఈ క్ర‌మంలో కుందేలు 2 కేజీల బ‌రువు తూగాక అమ్మితే నెల‌కు రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. అయితే కుందేళ్ల పెంప‌కం చేయాలంటే.. ముందుగా ఆ మార్కెట్‌పై అవ‌గాహ‌న ఉండాలి. కుందేళ్ల‌ను ఎక్క‌డ కొంటారు, ఎక్క‌డ వాటిని పెంచితే అనువుగా ఉంటుంది, వాటిని ఎలా ర‌వాణా చేయాలి, ఎక్క‌డ వ్యాపార అవ‌కాశాలు ఉంటాయి.. త‌దిత‌ర అంశాల‌ను ఒక్క‌సారి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ త‌రువాతే వాటి పెంప‌కం చేప‌ట్టాలి. దీంతో సుదీర్ఘ‌కాలం పాటు ఈ బిజినెస్‌లో చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news