అంతర్జాతీయ మార్కెట్లకు ఓలా గుడ్ బై..!

-

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా క్యాబ్స్  కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లోని తన కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు కల్లా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉన్న తన వ్యాపారాన్ని మూసివేయనుంది. ఇప్పటికే యూజర్లకు నోటిఫికేషన్లు పంపుతోంది. ఆయా దేశాల్లో ఎదురవుతున్న పోటీ, ఫ్లీట్ను పూర్తిగా విద్యుదీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా భారత్ మార్కెట్ పైనే ఓలా దృష్టి పెట్టనుంది. తమ ప్రాధాన్యాలను సమీక్షించుకున్నాక యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని తమ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకి వెల్లడించారు.

వ్యక్తిగత వాహన విభాగంతో పాటు క్యాబ్ సేవల విభాగంలోనూ విద్యుత్ వాహనాలదే భవిష్యత్ అని పేర్కొన్నారు. భారత్లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన పలికే అవకాశం ఉంది. క్యాబ్ సర్వీసులందించేందుకు పూర్తిగా విద్యుత్ వాహనాలనే వినియోగించాలంటూ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న క్యాబ్లను ఈవీలుగా మార్చాలంటే ఓలా రెట్టింపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనికితోడు ఆస్ట్రేలియా, యూకేలో పోటీ కూడా అధికంగా ఉండడంతో ఓలా ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news