బాలయ్య నటించిన అఖండ సినిమా యాభై రోజుల పండుగ నేడు.. మొత్తం 103 సెంటర్లలో యాభై రోజుల పండగ చేసుకునేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా సాధించిన విజయోత్సాహంతో బాలయ్య ఎంతో ఆనందంగా ఉన్నారు. త్వరలోనే సీక్వెల్ కు కూడా ప్లాన్ చేస్తున్నారు. కాగా రేపు ఓటీటీలో కూడా అఖండ సందడి చేయనుంది.
డిస్నీ హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఇదే రోజు నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగరాయ్ విడుదల కానుంది. ఓకే రోజు రెండు వేర్వేరు ఓటీటీలలో అటు బాలయ్య, ఇటు నాని సినిమా ప్రేమికులను అలరించడం ఖాయం అని తేలిపోయింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే మొదట్నుంచి కథ బాగుందని తాను చేస్తే తప్పక విజయవంతం అవుతుందని నమ్మకంతోనే బాలయ్య ఉన్నారు.. అఖండ సినిమా విషయంలో! నిర్మాత మిరియాల రవిందర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.
టికెట్ ధరలు తగ్గించి జీఓ ఇచ్చినా ఒక్క మాట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అదేవిధంగా తమకు ఏపీ సర్కారు ఎంతో సాయం చేసిందని కూడా నిర్మాత చెప్పుకువచ్చారు. అంటే కొన్ని చోట్ల బెన్ఫిట్ షోలు వేసినా కూడా జగన్ సర్కారు చూసీ చూడని విధంగా వదిలేసింది.
సినిమా గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే.. తమన్ సంగీతంతో పాటు ప్రగ్యా జైస్వాల్ నటన, బాలయ్య డైలాగ్ డెలివరీ అన్నీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు అయ్యాయి. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం ప్రేక్షకులను కట్టిపడేసింది. మంత్ర ముగ్ధులను చేసింది.ముఖ్యంగా ఆయన నటనతో పాటు స్టంట్స్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.
బోయపాటి మార్కు సన్నివేశాలు, బిల్డప్ షాట్లతో ఓ రేంజ్ లో సినిమా ఉంది. దీంతో అభిమానులకు ఈ సినిమా మాస్ జాతరే! ముందునుంచి చెప్పిన విధంగానే బాలయ్య అభిమానులకు నిజంగానే పూనకాలే! అందుకే సినిమాకు వసూళ్లు ఎక్కడా ఆగలేదు.తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్ అదిరిపోయింది. ఇప్పటికీ అమెరికా,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ తదితర దేశాల్లో సినిమా దిగ్విజయవంతంగా నడుస్తుండడం విశేషం.