సినీ హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సిద్ధార్థ్ తో పాటు సినీ గాయకుడు టీఎం కృష్ణ కూడా హాజరయ్యాడు.
చెన్నైలో 600మంది ఆందోళన కారులపై కేసులు
ఈ నేపథ్యంలో, ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధార్థ్ తో పాటు దాదాపు 600 మంది నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది. కాగా, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సహా 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికి, ఆందోళన చేపట్టినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.